హైదరాబాద్‌కు చేరుకున్న కేంద్ర బృందం
By సుభాష్ Published on 22 Oct 2020 9:38 AM GMTగత వారం రోజులుగా కురిసిన భారీ వర్షాలు తెలంగాణ రాష్ట్రాన్ని అతలాకుతలం చేశాయి. ముఖ్యమంగా హైదరాబాద్ నగరంలో వర్షాలు ముంచెత్తాయి. భారీ వరదల వల్ల తీవ్ర నష్టం వాటిల్లింది. దీంతో నష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్ర బృందం తెలంగాణ రాష్ట్రంలో పర్యటిస్తోంది. కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి ప్రవీణ్ వశిష్ఠ నేతృత్వంలోని అధికారుల బృందం రెండు రోజుల పాటు రాష్ట్రంలో పర్యటించనుంది. వరద ప్రాంతాల్లో పరిస్థితులను కేంద్ర బృందానికి నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రజత్‌కుమార్ వివరించారు.
గురువారం హైదరాబాద్‌కు చేరుకున్న ఐదుగురు సభ్యులు గల కేంద్ర బృందం సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, ఉన్నతాధికారులతో సమావేశమైంది. వివిధ శాఖల కార్యదర్శులు, పోలీసు అధికారులు, జీహెచ్‌ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల కలెక్టర్లు సమావేశంలో పాల్గోన్నారు. వర్షాల వల్ల రాష్ట్రంలో జరిగిన నష్టాన్ని బృందం సభ్యులకు వివరించారు. నష్టానికి సంబంధించి ఫోటో ప్రదర్శన ఏర్పాటు చేశారు. అనంతరం కేంద్రం బృందం క్షేత్ర స్థాయిలో పరిశీలించనుంది. కేంద్ర బృందం రెండు బృందాలుగా విడిపోయి రాష్ట్రంలో వరద పరిస్థితులపై అధ్యయనం చేయనుంది.
అలాగే పాతబస్తీ చంద్రాయణగుట్ట, గుట్టపల్లె చెరువు, ఇతర ముంపు ప్రాంతాలను ఇద్దరు సభ్యులు పర్యటించనున్నారు. అలాగే రెండో బృందం సిద్దిపేట జిల్లాలోనూ సందర్శించనున్నారు. ఆయా జిల్లాల్లో జరిగిన నష్టాన్ని అంచనా వేయనున్నారు. అనంతరం కేంద్ర బృందం రాష్ట్రంలో వరద పరిస్థితులు, నష్టాన్ని కేంద్రానికి నివేదిక ఇవ్వనుంది.