కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పండగకు పదివేలు.. రాష్ట్రాలకు రూ.12వేల కోట్లు
By సుభాష్ Published on 13 Oct 2020 10:13 AM ISTకేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ అడ్వాన్స్‌గా రూ.10వేల చొప్పున ఇవ్వనున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. కోవిడ్ కారణంగా దేశ ఆర్థిక వ్యవస్థలో డిమాండ్ పడిపోవడంతో కొనుగోళ్లకు ఊతమిచ్చేందుకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మొత్తాన్ని పది వాయిదాల్లో ఉద్యోగి వేతనం నుంచి తిరిగి తీసుకుంటామని తెలిపారు. అలాగే ఉద్యోగులకు ఇచ్చే ప్రయాణ భత్యానికి బదులుగా ఈ ఏడాది ఆదాయపన్ను లేని నగదు వోచర్లు ఇస్తామన్నారు. 10 రోజులకు లీవ్ కాన్‌క్యాష్‌మెంట్ సదుపాయం కూడా అందించనున్నట్లు చెప్పారు. అయితే ఈ ప్రయోజనాలు పొందేవారు పలు షరతులకు లోబడి కొనుగోళ్ల చేయాల్సి ఉంటుంది.
రాష్ట్రాలకు రూ.12వేల కోట్లు
మరో వైపు లాక్‌డౌన్ కారణంగా ఆదాయాలు పడిపోయి ఇబ్బందులు ఎదుర్కొంటున్న రాష్ట్రాలకు రూ.12వేల కోట్ల దీర్ఘకాలిక వడ్డీ రహిత రుణాలను కూడా మంత్రి నిర్మల సీతారామన్ ప్రకటించారు. ఈ రుణాల కాలపరిమితి 50ఏళ్లు. అలాగే దేశంలో మౌలిక వసతుల కల్పనకు రూ.25వేల కోట్లు, కేంద్రం నిర్ధేశించిన సంస్కరణలు అమలు చేసినందుకు మరోరూ.2వేల కోట్లు ఇవ్వనున్నట్లు ప్రకటించారు.
ఈ ఏడాది దసరా పండగ నెల చివరలో వస్తున్నందున ఉద్యోగులు కొనుగోళ్లు చేసేందుకు వీలుగా వేతనంలో రూ.10వేలు పండగ అడ్వాన్స్‌గా వేతన రుణం ఇస్తారు. ఈ మొత్తాన్ని ఉద్యోగులకు రూపే కార్డులను ఇస్తారు. ఈ అడ్వాన్స్‌ను ప్రభుత్వం గరిష్ఠంగా పది వాయిదాల్లో ఉద్యోగి వేతనం నుంచి వెనక్కి తీసేసుకుంటుంది. రూపే కార్డు ఖర్చును ప్రభుత్వమే భరిస్తుంది. ఎల్టీసీకి బదులుగా ఇచ్చే నగదు వోచర్లతో ఉద్యోగులు వస్తువులు మాత్రమే కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఆహార పదార్థాలపై ఖర్చు చేయరాదు. అది కూడా జీఎస్టీ చట్టంకింద నమోదు చేసుకున్న సంస్థ లేదా వ్యాపారస్థుడి వద్ద ఆన్‌లైన్‌లోనే కొనుగోళ్లు జరపాలి. ఉద్యోగులు కొనుగోలు చేసే వస్తువుల 12 అంతకంటే ఎక్కువ శాతం జీఎస్టీ పరిధిలోకి వచ్చేవి అయి ఉండాలి.
అలాగే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు నాలుగేళ్లకు ఒక బ్లాక్‌గా ఎల్టీసీని అమలు చేస్తున్నారు. ఇందులో ఒకరోజు దేశంలో ఎక్కడికైనా పర్యటనకు వెళ్లవచ్చు. 2-3 పర్యటనలు ఉద్యోగి నివాసం ఉంటున్న పట్టణానికి పరిమితం. తాజా నగదు ఓచర్లలో ఒక పర్యటనకు ఇచ్చే భత్యాన్ని నగదు రూపంలో మార్చుకోవచ్చు. ఈ పథకంలో చేరే ఉద్యోగి ఓచర్ ద్వారా వచ్చే మొత్తానికి మూడింతలు వస్తువులు కొనుగోలుపై ఖర్చు పెట్టాలి. లేదా సెలవులను నగదు రూపంలోకి మార్చుకోవడం ద్వారా వచ్చే నగదు కంటే రెట్టింపు ఖర్చు చేయాలి. కేంద్ర సర్కార్ నిబంధనలు పాటిస్తే రాష్ట్రాలతో పాటు ప్రైవేటు రంగంలోని కూడా ఉద్యోగులకు పన్ను మినహాయింపు లభిస్తుంది.
రాష్ట్రాలకు రూ.12వేల కోట్ల రుణం
లాక్‌డౌన్ కారణంగా ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న రాష్ట్రాలకు రూ.12వేల కోట్లు దీర్ఘకాలిక మూలధనం రుణం అందివ్వనున్నట్లు ఆర్థికశాఖ మంత్రి వెల్లడించారు. ఇందులో ఈశాన్య రాష్ట్రాలకు రూ.1600 కోట్లు, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్‌లకు రూ.900 కోట్లు, ఇతర రాష్ట్రాలకు రూ.7,500 కోట్లు ఇస్తామని ప్రకటించారు. అయితే 50ఏళ్ల కాలపరిమితి ఉన్న ఈ రుణాలకు ఎలాంటి వడ్డీ ఉండదు. ఇందులో 50శాతం మొదటి విడతగా ఇచ్చి అది ఖర్చు చేసిన తర్వాత మిగతాది ఇస్తారు.