తెలుగోళ్లు మహా పనోళ్లు.. తాజా సర్వే చెప్పిన నిజమట
By సుభాష్ Published on 18 July 2020 11:02 AM ISTఆసక్తికర సర్వే ఫలితం ఒకటి విడుదలైంది. జాతీయ జనాభా గణన ఆధారంగా శాంపిల్ రిజిస్ట్రేషన్ సిస్టం తాజాగా నివేదికను విడుదల చేసింది. ఇందులో ఆసక్తికర అంశాలు బయటకు వచ్చాయి. సెన్సస్ కమిషనర్ - రిజిస్ట్రార్ జనరల్ కార్యాలయం గణాంకాల ఆధారంగా నివేదికను సిద్ధం చేసింది. దీని ప్రకారం రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు బాగా పనోళ్లుగా తేల్చింది. దేశంలోని మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే.. పిన్న వయసులోనే పని చేసే ధోరణి ఎక్కువన్న విషయాన్ని స్పష్టం చేసింది.
పని చేసే వయసుగా పాతికేళ్ల నుంచి 59 ఏళ్ల వరకు వరకు తీసుకుంటే.. ఈ వయసులోని మొత్తం జనాభాలో 70 శాతం మంది పని చేసే వారే ఉన్నట్లుగా గుర్తించారు. జాతీయ సగటుతో పోలిస్తే.. రెండు తెలుగు రాష్ట్రాల్లో శ్రమైక జీవన సౌందర్యం కొట్టొచ్చినట్లుగా కనిపిస్తోందని చెబుతున్నారు. దేశ వ్యాప్తంగా చూస్తే.. 25-59 మధ్య పని చేసే వయస్కులు 66 శాతం ఉన్నట్లుగా తేల్చారు. మొత్తం జనాభాలో మూడింట రెండు వంతులు పని చేసే వారే ఉన్నారు.
ప్రస్తుతం దేశంలోని పన్నెండు రాష్ట్రాల్లో ఈ వయస్కులు పని చేసే వారు ఉంటే.. గతంలో ఇలాంటి పరిస్థితి దేశంలోని నాలుగు రాష్ట్రాలకు మాత్రమే ఉండేదని.. ఇప్పుడది కాస్తా మరిన్ని రాష్ట్రాలకు విస్తరించినట్లుగా పేర్కొన్నారు. ఈ మార్పు కారణంగా దేశంలో ఆర్థిక కార్యకలాపాల్లో భాగస్వాములు అవుతారని చెబుతున్నారు. పని చేసే జనాభా ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో రెండు తెలుగురాష్ట్రాలు అగ్రపథాన నిలిచాయి. పని చేసే వయస్కులు తెలంగాణలో 71.1 శాతం ఉంటే.. ఏపీలో 70.9శాతం ఉన్నట్లుగా తేల్చారు. మూడో స్థానంలో ఢిల్లీ 69.9 శాతంతో ఉంటే.. చివరి స్థానంలో బిహార్ నిలిచింది. ఆ రాష్ట్రంలో కేవలం 59.9 శాతం మందే పని చేసే వారున్నారని చెబుతున్నారు.
దేశ జనాభాలో పాతికేళ్ల లోపు వయసులో ఉన్న వారు 25.9 శాతం మంది ఉంటే.. గ్రామీణ ప్రాంతాల్లో ఇదే వయసులోని వారు 27.5 శాతం ఉన్నట్లు తేల్చారు. పట్టణ ప్రాంతాల్లో 22.5 శాతం ఉన్నారు. అరవైఏళ్లు దాటిన వారు మాత్రం దేశ వ్యాప్తంగా 8.10 శాతం ఉన్నట్లు చెబుతున్నారు. ఏమైనా.. దేశంలోని ఇన్ని రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రాల వారు పని చేసే తత్త్వం ఎక్కువన్నది తెలుగోళ్లకు గర్వకారణంగా చెప్పక తప్పదు.