ఈ భువిలో సంగీతం ఉన్నంత కాలం బాలు అమరులే..
By తోట వంశీ కుమార్ Published on 25 Sept 2020 3:24 PM ISTగానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తిరిగి రావాలంటూ దేశ వ్యాప్తంగా అభిమానులు చేసిన ప్రార్థనలు ఫలించలేదు. ఆయన తుదిశ్వాస విడిచారన్న వార్తతో సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. సినీ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. కరోనా సోకినప్పుడు.. ”ధైర్యంగా దీన్ని ఎదుర్కొంటా. ఆరోగ్యంగా మీ ముందుకు వస్తానంటూ” అందరికీ ధైర్యం ఇచ్చిన ఎస్పీబీ, ఇవాళ మధ్యాహ్నం గం.1.04ని.లకు తుది శ్వాస విడిచారు. ఆయనను నివాళులు చెబుతూ సినీ ప్రముఖులు ట్వీట్లు చేస్తున్నారు.
మెగాస్టార్ చిరంజీవి స్పందిస్తూ గుండె బద్దలైనట్టుగా ఉందని అన్నారు. సంగీత ప్రపంచానికి ఇదొక చీకటి రోజని, బాలుగారి మరణంతో ఒక శకం ముగిసిపోయిందని అన్నారు. అద్భుతమైన స్వరంతో తనకు ఎన్నో మధురమైన పాటలను బాలు అందించారని.. తన విజయంలో ఆయన పాత్ర ఎంతో ఉందని చెప్పారు. ఘంటశాలగారికి వారసుడిగా ఎవరొస్తారని సినీ ప్రపంచం ఎదురు చూస్తున్న తరుణంలో.. బాలుగారు ఒక ధ్రువతారలా దూసుకొచ్చారని చిరంజీవి అన్నారు. తన మధురమైన గానంతో భాష, సంస్కృతుల సరిహద్దులను చెరిపేశారని చెప్పారు. దశాబ్దాల పాటు దేశ వ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులను అలరించారని కొనియాడారు. బాలుగారి స్థానాన్ని మరెవరూ భర్తీ చేయలేరని, తన మరణం ద్వారా ఏర్పడిని శూన్యాన్ని పునర్జన్మ ద్వారా ఆయనే భర్తీ చేస్తారని చెప్పారు. బాలు లేని లోటు తీర్చలేనిదని అన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.
తెలుగు వారి ఆరాధ్య స్వరం మూగబోయింది. భారతీయ సంగీతం తన ముద్దు బిడ్డను కోల్పోయింది. ఐదు దశాబ్దాలకు పైగా 16 భాషల్లో 40 వేలకు పైగా పాటలకు జీవం పోసిన గాన గాంధర్వ , పద్మ భూషణ్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు ఇక లేరు అనే వార్త తీవ్రంగా కలచివేసింది. ఈ భువిలో సంగీతం ఉన్నంత కాలం మీరు అమరులే - ఎన్టీఆర్
ఎస్పీ బాలసుబ్రమణ్యం గారు ఇకలేరనే చేదు వార్తను జీర్ణించుకోవడం కష్టంగా ఉంది. ఆయన అమృత స్వరానికి మరొకటి సాటి రాదు. మీ ఆత్మకు శాంతి చేకూరాలి సర్. మీ స్వరం జీవంతోనే ఉంటుంది. ఇటువంటి కష్ట సమయాన్ని తట్టుకునే శక్తి ఆ దేవుడు కుటుంబ సభ్యులకు ఇవ్వాలని ప్రార్థిస్తున్నా - మహేష్ బాబు