వివేకానందరెడ్డి హత్య కేసు.. అనుమానితులను విచారిస్తున్న సీబీఐ
By తోట వంశీ కుమార్ Published on 29 July 2020 8:18 AM GMTమాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ 12వ రోజు కొనసాగుతోంది. పులివెందులకు చెందిన వైసీపీ రాష్ట్ర కార్యదర్శి దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి బుధవారం ఉదయం కడపలో సీబీఐ విచారణకు హాజరయ్యారు. ప్రస్తుతం సీబీఐ అధికారులు ఆయన్ను విచారిస్తున్నారు. నగరంలోని సెంట్రల్ జైలు ఆవరణలో కేసు విచారణ కొనసాగుతోంది. ఇతను కడప ఎంపీ అవినాష్ రెడ్డికి సన్నిహితుడు.
వివేకా కుమార్తె సునీత ఈ కేసులో హైకోర్టుకు సమర్పించిన 15 మంది అనుమానితుల జాబితాలో శివశంకర్ రెడ్డి పేరు కూడా ఉంది. హత్య జరిగిన రోజు ఘటనా స్థలిలో వైఎస్ కుటుంబ సభ్యులతోపాటు ఆయన కూడా ఉన్నారు. ఆయన సాక్ష్యాలు తారుమారు చేయడానికి సహకరించారని ఆరోపణలు ఉన్నాయి. వివేకా హత్య జరిగిన తర్వాత కొందరు అనుమానితులతో ఆయన మాట్లాడినట్లు సునీత హైకోర్టుకు తెలిపారు. గతంలో శివశంకర్ రెడ్డిని ఐదు రోజులపాటు ప్రత్యేక దర్యాప్తు సంస్థ (సిట్) అధికారులు విచారించిన సంగతి తెలిసిందే.