అలిపిరి రోడ్ల మీద రష్యా అమ్మాయి.. అసలు విషయం తెలిస్తే..

By సుభాష్  Published on  29 July 2020 7:40 AM GMT
అలిపిరి రోడ్ల మీద రష్యా అమ్మాయి.. అసలు విషయం తెలిస్తే..

కరోనా విసిరిన సవాళ్లతో ఊహించని పరిణామాలుచోటు చేసుకుంటున్నాయి. కొన్నిచోట్ల మానవత్వం పరిమళిస్తే.. మరికొన్నిచోట్ల దారుణాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పుడు చెప్పే అంశం మొదటి తరహాలోనిది. రష్యాకు చెందిన ఎస్తర్ కు అథ్యాత్మిక భావనలు ఎక్కువ. ఫిబ్రవరిలో భారత్ కు వచ్చారు. ఫిజియోథెరపిస్ట్ అయిన ఆమె తన తల్లి ఒలివియాతో కలిసి భారత్ కు వచ్చారు. టూరిస్టు వీసా మీద వచ్చిన ఆమె మహారాష్ట్ర.. పశ్చిమబెంగాల్ లోని ఆలయాల్ని సందర్శించారు. అదే సమయంలో కరోనా కారణంగా లాక్ డౌన్ విధించటంతో భారత్ లో ఇరుక్కుపోయారు. విదేశాలకు విమాన సర్వీసుల్ని నిలిపివేయటంతో వారు ఇండియాలోనే ఉండిపోవాల్సి వచ్చింది.

ఇదిలా ఉండగా.. ఆమె తిరుమల శ్రీవారి దర్శనం కోసం ఈ నెల 19న తిరుపతికి వచ్చారు. కరోనా కారణంగా విదేశీ భక్తులకు స్వామి దర్శనం లేదని తెలుసుకొని నిరాశ చెందారు. అదే సమయంలో వారి వద్ద డబ్బులు అయిపోతున్న వేళ.. రష్యన్లు అధికంగా వచ్చే బృందావనం (ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉంది) వెళ్లి.. అక్కడి తమ దేశస్తుల వద్ద నుంచి ఆర్థిక సాయం తీసుకోవాలని భావించారు. ఇందులో భాగంగా ఒలియా తిరుపతిలో ఉంటే.. ఆమె తల్లి బృందావనం వెళ్లారు. అయితే.. కోవిడ్ కారణంగా విదేశీయులు రావటం లేదన్న విషయాన్ని తెలుసుకొని నిరాశ చెందారు.

అదే సమయంలో తిరుపతిలో ఉన్న ఒలియా చేతిలో ఉన్న డబ్బులు అయిపోతున్నాయి. దీంతో.. ఆమె అలిపిరిలోని ఇస్కాన్ వారిని సంప్రదించింది. అక్కడ కూడా యాత్రికుల మీద ఆంక్షలు ఉండటంతో ఆమె భోజన వసతి తాము చూసుకుంటామని చెప్పారు. అదే సమయంలో వసతి కోసం అద్దె ఇంటిని చూస్తామని చెప్పారు. దిక్కు తోచక అలిపిరి రోడ్డు మీద వెళుతున్న ఆమె మీడియా కంట పడింది. ఆమె ఎవరు? ఏమైందన్న వివరాల్ని తెలుసుకునే ప్రయత్నం చేసింది. ఆమె దీన గాథ స్థానిక పత్రికల్లో అచ్చయింది. వెంటనే స్పందన మొదలుంది. ఆమెకు సాయం చేసేందుకు పలువురు ముందుకు వచ్చారు.

ఈ సందర్భంగా ఆమె తాను ఉచితంగా ఆర్థిక సాయం తీసుకోవటానికి నిరాకరించారు. తన ప్రొఫెషన్ అయిన ఫిజియోథెరపిస్టుగానూ.. ఆలయాల్నిప్రత్యేకంగా అలంకరించే కళలోనూ ప్రవేశం ఉండటంతో తనకు అవకాశమిస్తే చేస్తానని చెబుతున్నారు. అంతేకాదు.. తమకుఎవరైనా సాయం చేస్తే రష్యాకు వెళ్లిపోతామంటున్నారు. ఈ విషయం తెలుసుకున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత.. తిరుపతి ఎమ్మెల్యే భూమానా కరుణాకరరెడ్డి స్పందించారు. తన సహాయకుల చేత ఆమెకు ఆర్థిక సాయాన్ని పంపారు. అదే సమయంలో చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా రియాక్టు అయ్యారు.

ఆమెకు స్వామివారి దర్శనం కల్పించటమే కాదు.. తన సొంత నిధులతో ఆమెను.. ఆమె తల్లిని రష్యాకు పంపటానికి సిద్ధంగా ఉన్నామని.. అప్పటివరకు తిరుపతిలోనే వసతి.. బస ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. ఎవరికి లేని వారికి దేవుడే దిక్కు అనే నానుడి ఒలియా విషయంలో నిజం కావటమే కాదు.. స్వామివారి దర్శనానికి తపించిన ఆమె కోరిక.. మానవత్వం కారణంగా తీరటమే కాదు.. ఆమె కష్టాలకు చెక్ పెడుతున్న వైనాన్ని మర్చిపోలేం.

Next Story
Share it