లాక్‌డౌన్‌ సమయంలో 'అదృశ్యం' కేసులు.. రోజుకు ఎంత మంది అంటే..!

By అంజి  Published on  5 April 2020 5:37 AM GMT
లాక్‌డౌన్‌ సమయంలో అదృశ్యం కేసులు.. రోజుకు ఎంత మంది అంటే..!

లాక్‌డౌన్‌లోనూ అదృశ్యం కేసులు అంటూ ఈనాడు దినపత్రిక కథనం రాసింది. కరోనా వైరస్‌ ప్రపంచాన్నే వణికిస్తోంది. ఈ వైరస్‌ భయంతో జనాలు ఇంటి గడప దాటడం లేదు. బయటకు వస్తే కరోనా వైరస్‌ సోకుతుందేమోనన్న భయం వెంటాడుతోంది. తెలుగు రాష్ట్రాల్లోనూ కరోనా వైరస్‌ విజృంభిస్తోంది. ఈ నేపథ్యంలో లాక్‌డౌన్‌ అమలు చేశారు. ప్రజలు ఎవరూ కూడా బయటకు రాకుండా పోలీసులు 24 గంటలు పహారా కాస్తున్నారు. ఇంత కట్టడి సమయంలోనూ కొందరు అదృశ్యమవుతున్నారు.

గడిచిన 12 రోజుల వ్యవధిలో తెలంగాణలో 356 మంది కనిపించకుండా పోయారు. స్థానిక పోలీస్‌స్టేషన్‌లలో అదృశ్యం కేసులు కూడా నమోదయ్యాయి. సగటున రోజుకు 30 మంది కనపడకుండా పోయారు. లాక్‌డౌన్‌లో భాగంగా రాత్రి 7 గంటల నుంచి వాహనాలను పోలీసులు రోడ్లపైకి అనుమతించడం లేదు. పోలీసులు తనిఖీలు కూడా చేస్తున్నారు. హోటళ్లు, లాడ్జీలు అన్ని మూతపడ్డాయి. తిండి కూడా సరిగా దొరకదు. ఇక బంధువులను ఇళ్లలోనికి రానిచ్చేందుకు ఎవరూ ఇష్టపడటం లేదు. ఇలాంటి సమయంలో అదృశ్యమైన 356 మంది ఎక్కడి వెళ్లారన్నది ప్రశ్నార్థకంగా మారింది. అయితే వీటిలో చాలా కేసులు కొలిక్కి వస్తున్నట్లు పోలీసు వర్గాల నుంచి సమాచారం అందినట్లు దినపత్రిక తన కథనంలో వెల్లడించింది.

అదృశ్యం కేసుల్లో అనేక కారణాలు ఉండొచ్చు. వాటిలో ముఖ్యంగా ప్రేమ వ్యవహారాలు, అనైతిక సంబంధాలు, పిల్లల ఆదరణ లభించక ఇళ్లు వదిలిపోయే వృద్ధులు ఉంటారు. లాక్‌డౌన్‌ అమలు అయినప్పటి నుంచి వైన్ షాప్‌లు బంద్‌ అయ్యాయి. దీంతో చాలా మంది మందు దొరక్క మతి స్థిమితం కోల్పోతున్నారు. కొందరు మందు కోసం అన్వేషిస్తూ.. ఇళ్లు వదిలిపెట్టి వెళ్లి పోతున్నారని సమాచారం.

Next Story