కరేబియన్ ప్రీమియర్ లీగ్ కు వేళాయె..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  18 Aug 2020 7:44 AM GMT
కరేబియన్ ప్రీమియర్ లీగ్ కు వేళాయె..!

భారత క్రికెట్ అభిమానులు అమితంగా అభిమానించే ఇతర దేశ ఆటగాళ్లు ఎవరంటే మొదట వెస్టిండీస్ ఆటగాళ్లు అనే చెబుతారు. ఇక నేటి నుండి విండీస్ ఆటగాళ్ల విధ్వంసం మొదలుకానుంది. కరేబియన్ ప్రీమియర్ లీగ్ నేటి నుండి మొదలుకానుండడంతో క్రికెట్ అభిమానులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉన్నారు.

ఆగష్టు 18న కరేబియన్ ప్రీమియర్ లీగ్ లో మొదటి మ్యాచ్ జరగనుంది. కరేబియన్ దీవుల్లో క్రికెట్ మ్యాచ్ అంటే ఒక పార్టీ లాగా సాగుతూ ఉంటుంది. కానీ ఈసారి ఉన్న పరిస్థితుల కారణంగా ఖాళీ స్టాండ్స్ లోనే క్రికెట్ ను చూడాల్సి ఉంటుంది. ఈ టోర్నమెంట్ ను నిర్వహించడానికి అధికారులు ఎన్నో జాగ్రత్తలు తీసుకోనున్నారు. పెద్ద ఎత్తున ప్రోటోకాల్స్ అమలులో ఉన్నాయి. క్రికెటర్లు ఎక్కడకు వెళ్ళడానికి కూడా లేదు.. అందుకే ఎంతో ఆసక్తిగా గమనిస్తూ ఉన్నారు ఇతర దేశాలకు చెందిన లీగ్ నిర్వాహకులు కూడానూ..!

కరేబియన్ ప్రీమియర్ లీగ్ ఎనిమిదో ఎడిషన్ లో మొత్తం 33 మ్యాచ్ లు ఉండనున్నాయి. ట్రినిడాడ్ అండ్ టొబాగోలో ఈ టోర్నమెంట్ ను నిర్వహించనున్నారు. టోర్నమెంట్ కు ఒక్క రోజు ముందు వరకూ కూడా కేవలం 552 పాజిటివ్ కేసులు మాత్రమే నమోదయ్యాయి.. 11 మంది మరణించారు. టోర్నమెంట్ లో పాల్గొనే ఆటగాళ్లు, సపోర్ట్ స్టాఫ్ లకు కరోనా టెస్టులు నిర్వహించగా నెగటివ్ అని వచ్చింది. పోర్ట్ ఆఫ్ స్పెయిన్ లో ఉన్న హిల్టన్ హోటల్ లో అందరినీ ఉంచారు.

ప్రస్తుతమున్న పరిస్థితుల కారణంగా చాలా మంది ఇతరదేశాలకు చెందిన స్టార్స్ టోర్నమెంట్ మీద ఆసక్తి చూపించలేదు.. అలాగే ట్రావెలింగ్ కూడా తక్కువ ఉండనుంది.. చూడడానికి స్టేడియం లలో అనుమతి లేకపోవడం కూడా పెద్ద మైనస్ గా చెప్పొచ్చు. అలాగని టోర్నమెంట్ కు హైప్ లేదా అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉన్నారు. ఈ క్రికెట్ లీగ్ అయిపోగానే ఐపీఎల్, బిగ్ బాష్ లీగ్ లు కూడా మొదలుకావాల్సి ఉంది. ఈ టోర్నీను ఎలా నిర్వహిస్తారో చూడాల్సి ఉంది. ఇక విండీస్ ఆటగాళ్ల భారీ స్కోర్లు, ఛేజింగ్ లు చూడడానికి ఎంతగానో ఎదురుచూస్తూ ఉన్నారు. పొలార్డ్, రస్సెల్, హెట్మయర్, నికోలస్ పూరన్ లాంటి ఆటగాళ్లు ఈ టోర్నమెంట్ నుండే పుట్టుకొచ్చారు. ఈ ఏడాది ఏ స్టార్ వెలుగు వెలుగుతాడో అని కూడా ఆసక్తిగా గమనిస్తూ ఉన్నారు.

మొదటి పది మ్యాచ్ లు తరౌబా లోని బ్రియాన్ లారా క్రికెట్ అకాడెమీలో నిర్వహించనుండగా.. ఆ తర్వాత క్వీన్ పార్క్ ఓవల్ లో నిర్వహించనున్నారు. ఇది ముగిసిన తర్వాత తిరిగి బ్రియాన్ లారా క్రికెట్ అకాడెమీలో ఆడనున్నారు. ఒకే తరహా పిచ్ ల పై ఆడడం వలన సీజన్ సెకండ్ హాఫ్ లో లో స్కోరింగ్ మ్యాచ్ లు నమోదయ్యే అవకాశం ఉందని క్రికెట్ నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. మిగతా లీగ్ లతో పోలిస్తే కరేబియన్ ప్రీమియర్ లీగ్ డిఫరెంట్ అయినప్పటికీ.. క్రికెట్ అభిమానులను ఎంటర్టైన్ చేయడంలో మాత్రం ఎప్పుడూ విఫలం అవ్వలేదు. ఈ ఏడాది కూడా అలరిస్తుందని అందరూ భావిస్తూ ఉన్నారు.

ఈ సీజన్ ట్రిన్ బాగో నైట్ రైడర్స్, గయానా అమెజాన్ వారియర్స్ మధ్య మ్యాచ్ ద్వారా ఆరంభం కానుంది. భారత కాలమానం ప్రకారం సాయంత్రం 7:30 కు మ్యాచ్ మొదలవ్వనుంది.

Next Story