వాగులో కొట్టుకుపోయిన కారు..

By తోట‌ వంశీ కుమార్‌  Published on  30 July 2020 6:31 AM GMT
వాగులో కొట్టుకుపోయిన కారు..

భారీ వర్షాలు కురుస్తుండడంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. కొన్ని చోట్ల వాగులు రోడ్లపై నుంచే ప్రవహిస్తున్నాయి. అయితే.. నీటి ప్రవాహాన్ని అంచనా వేయకుండా పలువురు తమ వాహనాలతో వాగు దాటే ప్రయత్నం చేస్తున్నారు. మొన్న తెలంగాణలోని జోగులాంబ గద్వాల జిల్లాలో వాగులో గర్భిణీ మహిళ గల్లంతై.. మృతి చెందిన విషయం మరువకముందే అలాంటి ఘటన అనంతపురం జిల్లా గుత్తి మండలంలో చోటు చేసుకుంది. అయితే.. స్థానికులు కారులో ఉన్న వారిని రక్షించారు.

రాకేశ్‌, యూసూఫ్‌ కడప నుంచి నుంచి బిజాపూర్‌కు కారులో బయలు దేరారు. 63వ జాతీయ రహదారిపై రజాపురం వద్ద వాగు ఉద్దృతంగా ప్రవహిస్తుంది. అయినప్పటికి కారులో వాగుదాటే ప్రయత్నం చేశారు. గుంతకల్లు వైపు వస్తున్న కర్ణాటకకు చెందిన ఆర్టీసీ బస్సు వెనుకాలే.. కారును వాగు దాటించేందుకు ప్రయత్నించారు. బస్సు క్షేమంగా ఆవతలి ఒడ్డుకు చేరుకోగా.. నీటి ప్రవాహం అధికంగా ఉండడంతో కారు కొట్టుకుపోయింది. స్థానికులు గమనించి కారులో ఉన్న రాకేష్‌, యూసుఫ్‌లను రక్షించారు. కాగా.. కారు మాత్రం కొట్టుకుపోయింది. కారులో విలువైన వస్తువులు ఏమిలేవని, దుస్తులు ఉన్నట్లు వెల్లడించారు. వాగు ఉద్దృతంగా ప్రవహిస్తుండడంతో బస్సు కూడా కొట్టుకుపోయి ఉండేదని తృటిలో పెను ప్రమాదం తప్పిందని స్థానికులు తెలిపారు.

Next Story
Share it