మాజీ ఎయిర్ ఫోర్స్ పైలట్ ఆయన.. ల్యాండింగ్ కోసం చాలా ప్రయత్నించాడు

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  8 Aug 2020 4:03 AM GMT
మాజీ ఎయిర్ ఫోర్స్ పైలట్ ఆయన.. ల్యాండింగ్ కోసం చాలా ప్రయత్నించాడు

కేరళలోని కోజికోడ్ విమానాశ్రయంలో చోటుచేసుకున్న విమాన ప్రమాదంలో మృతి చెందిన వారి సంఖ్య 19కి పెరిగింది. వందే భారత్ మిషన్‌లో భాగంగా కోజికోడ్ వచ్చిన ఈ విమానంలో 190 మంది ప్రయాణికులు ఉన్నారు. ల్యాండింగ్ సమయంలో విమానం రన్‌వే నుంచి పక్కకు జరిగి 35 అడుగుల లోయలో పడి రెండు ముక్కలైంది.

ఈ ప్రమాదంలో పైలట్లు ఇద్దరూ మరణించారు. వింగ్ కమాండర్ దీపక్ వసంత్ సాథే, కెప్టెన్ అఖిలేష్ కుమార్ మరణించారు. దీపక్ వసంత్ సాథే గతంలో భారత ఎయిర్ ఫోర్స్ కు పని చేశారు. ఎయిర్ ఇండియా విమానాలు నడిపిన ఆయన ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలను నడపడానికి వెళ్లారు. నేషనల్ డిఫెన్స్ అకాడెమీ పూర్వ విద్యార్థి అయిన ఆయనకు బోయింగ్ 737 విమానాలను నడపడంలో ఎంతో అనువహవం ఉంది.

కెప్టెన్ దీపక్ వసంత్ సాథే నేషనల్ డిఫెన్స్ అకాడమీ 58వ కోర్సుకు చెందిన వారని.. జూలియట్ స్క్వాడ్రన్ కు చెందిన వారని ఎయిర్ మార్షల్ భూషణ్ గోఖలే(రిటైర్డ్) తెలిపారు. హైదరాబాద్ లోని ఎయిర్ ఫోర్స్ అకాడెమీలో స్వార్డ్ ఆఫ్ ఆనర్ ను అందుకుని జూన్ 1981 న పట్టాను అందుకున్నాడు. అద్భుతమైన స్క్వాష్ ఆటగాడని కూడా వెల్లడించారు మరో అధికారి. ఎయిర్ ఫోర్స్ టెస్ట్ పైలట్ గా కూడా ఆయన విధులు నిర్వర్తించారు.

కెప్టెన్ దీపక్ వసంత్ సాథే ఎయిర్ ఇండియాకు చెందిన ఎయిర్ బస్ 310ని కూడా నడిపాడు. కమర్షియల్ పైలట్ గా ఆయన మారకముందు ఫైటర్ పైలట్ గా విధులు నిర్వర్తించాడు.

దీపక్ వసంత్ సాథే తో పాటూ మరణించిన కెప్టెన్ అఖిలేష్ కుమార్ గత ఏడాది పెళ్లి చేసుకున్నాడు.

దుబాయ్‌–కాళికట్‌ ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ విమానం శుక్రవారం రాత్రి 7.40 గంటల సమయంలో కోళీకోడ్‌ ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండింగ్‌ సమయంలో ప్రమాదానికి గురైంది. భారీగా వర్షం పడుతుండటంతో రన్‌వే నుంచి పక్కకు జారి.. లోయవంటి ప్రదేశంలో పడిపోయింది. విమానం రెండు ముక్కలైంది. ఈ ప్ర‌మాద స‌మ‌యంలో విమానంలో 10 మంది చిన్నారులు సహా 184 మంది ప్రయాణీకులు, ఇద్దరు పైలట్లు, ఐదుగురు సిబ్బంది కలిపి మొత్తం 191 మంది ఉన్నారని ఎయిర్‌ ఇండియా తెలిపింది.

Next Story
Share it