Fact Check : కోవిద్-19 సోకి మరణించిన వారి శవాలను కాల్చడంతో వచ్చే పొగ ద్వారా కరోనా వ్యాప్తి చెందుతుందా..?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  29 July 2020 12:30 PM GMT
Fact Check : కోవిద్-19 సోకి మరణించిన వారి శవాలను కాల్చడంతో వచ్చే పొగ ద్వారా కరోనా వ్యాప్తి చెందుతుందా..?

కోవిద్-19 తో మరణించిన వ్యక్తిని ఖననం చేయడాన్ని కేరళకు చెందిన బీజేపీ కౌన్సిలర్ అడ్డుకోవడం వివాదాస్పదమైంది. కొట్టాయంలో కరోనా సోకి మరణించిన వ్యక్తిని కాల్చాలని అనుకుంటున్న సమయంలో దాన్ని కౌన్సిలర్ టి.ఎన్.హరి కుమార్ అడ్డుకున్నారు. పొగ, బూడిద కారణంగా కరోనా వ్యాప్తి చెందే అవకాశం ఉందని ఆయన సంచలన ఆరోపణలు చేశారు. ఖననాన్ని అడ్డుకున్నందుకు జులై 27న పోలీసులు హరి కుమార్ తో పాటూ, మరో ముప్పై మందిపై కేసును నమోదు చేశారు.

C1

కోవిద్ తో మరణించిన వ్యక్తిని స్థానిక క్రిస్టియన్ స్మశాన వాటికలో పాతిపెట్టాలని అధికారులు భావించారు. కోవిద్-19 ప్రోటోకాల్ ప్రకారం కరోనాతో చనిపోయిన వ్యక్తిని పాతిపెట్టడమే జాగ్రత్తతో కూడుకున్నదని హెల్త్ అధికారులు తెలిపారు. హరికుమార్ 'శవాన్ని మీ ఇంటికి తీసుకుని వెళ్ళండి' అంటూ అరుస్తున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

పొగ, బూడిద కారణంగా కరోనా వ్యాప్తి చెందే అవకాశం ఉందంటూ కేరళ బీజేపీ కౌన్సిలర్ చేసిన వ్యాఖ్యల్లో ఎంత వరకూ నిజముందో తెలియజేయాలంటూ పలువురు న్యూస్ మీటర్ ను కోరారు.

నిజ నిర్ధారణ:

కేరళ బీజేపీ కౌన్సిలర్ పొగ, బూడిద ద్వారా కరోనా వ్యాప్తి చెందుతుందంటూ చేసిన వ్యాఖ్యల్లో ఎటువంటి నిజం లేదు.

ఏప్రిల్ 3న Deccan Herald లో వచ్చిన కథనం ప్రకారం.. చనిపోయిన వ్యక్తులను పూడ్చేసిన తర్వాత కరోనా వైరస్ వ్యాప్తి అన్నది జరగదని వెస్ట్ బెంగాల్ హెల్త్ డిపార్ట్మెంట్ తెలిపింది. శవాన్ని తీసుకుని వెళ్లే సమయంలో అధికారులు తగినన్ని జాగ్రత్తలు తీసుకుంటే కరోనా సోకే అవకాశం ఉండదని.. వదంతులు నమ్మకండి అంటూ హెల్త్ డిపార్ట్మెంట్ అధికారులు తెలిపారు.

Telegraph India కథనం ప్రకారం.. కొట్టాయంకు చెందిన 83 సంవత్సరాల వ్యక్తి చనిపోయాడు. అతడికి కోవిద్-19 పరీక్షలు చేయగా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. హెల్త్ అధికారులు కుటుంబ సభ్యుల విన్నపం మేరకు స్థానిక క్రిస్టియన్ స్మశాన వాటికలో ఖననం చేయాలని భావించారు. ఇంతలో బీజేపీ కౌన్సిలర్ స్థానికులతో కలిసి వచ్చి అడ్డుకున్నారు. జిల్లా హెల్త్ అధికారులు కోవిద్-19 ప్రోటోకాల్ పాటించి మరీ శవాన్ని ఖననం చేస్తున్నప్పటికీ ఆయన అడ్డుకున్నాడని స్థానికులు చెబుతున్నారు.

యూనియన్ మినిస్ట్రీ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కూడా కోవిద్ ద్వారా చనిపోయిన వారిని పూడ్చేసిన తర్వాత కానీ.. కాలుస్తున్నప్పుడు వచ్చే పొగ, బూడిద వలన కరోనా సోకదు అని తేల్చారు.

వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా కోవిద్ కారణంగా మరణించిన వారి మృత దేహాలను ఎలా జాగ్రత్త పరచాలి, ఖననం ఎలా చేయాలి అన్న విషయాలపై పూర్తీ మార్గదర్శకాలను విడుదల చేసింది.

పొగ, బూడిద కారణంగా కరోనా వ్యాప్తి చెందే అవకాశం ఉందని బీజేపీ నేత చేసిన వ్యాఖ్యల్లో ఎటువంటి నిజం లేదు.

Next Story