Fact Check : సహాయం కావాలనుకుంటున్న వాళ్లు టోల్ ఫ్రీ నెంబర్ కు ఫోన్ చేస్తే సోనూ సూద్ సాయం చేస్తారా..?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  29 July 2020 11:31 AM GMT
Fact Check : సహాయం కావాలనుకుంటున్న వాళ్లు టోల్ ఫ్రీ నెంబర్ కు ఫోన్ చేస్తే సోనూ సూద్ సాయం చేస్తారా..?

సోనూ సూద్.. లాక్ డౌన్ సమయంలో ఈయన పేరు దేశ వ్యాప్తంగా మారుమ్రోగిపోయింది. అన్ లాక్ సమయంలో అంతకంతకు మించి ఆయన పేరు దేశ వ్యాప్తంగా సంచలనం అవుతోంది. ఈ మధ్యనే చిత్తూరు జిల్లా రైతుకు ఏకంగా ట్రాక్టర్ ను బహుమతిగా ఇవ్వడంతో తెలుగు రాష్ట్రాల్లో కూడా సోనూ చేస్తున్న సేవల గురించి విస్తృతమైన చర్చ జరుగుతోంది.

A1

ఓ టోల్ ఫ్రీ నెంబర్ కు ఫోన్ చేస్తే సోనూ సూద్ సహాయం చేస్తాడనే పోస్టులు సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో ఈ పోస్టు వైరల్ అవుతోంది. 1800 121 3711 ఈ నెంబర్ కు కాల్ చేసి సహాయం కోరాలని పలువురు పోస్టులు పెట్టారు. టాలీవుడ్ హీరోలు బాలీవుడ్ రీల్ విలన్ ను చూసి సిగ్గు పడాలని కొందరు పోస్టులు పెడుతున్నారు.

“For help from real hero Sonu Sood, call toll-free number 1800 121 3711. Tollywood heroes must be ashamed of themselves after seeing Bollywood reel villain Sonu Sood." అని పోస్టులు పెడుతున్నారు.

వాట్సప్ లో కూడా ఈ పోస్టు వైరల్ అవుతోంది.

నిజ నిర్ధారణ:

1800 121 3711 ఈ నెంబర్ కు కాల్ చేస్తే సోనూ సూద్ సహాయం చేస్తాడన్నది 'నిజమే'.

‘Sonu Sood Toll-free number’ అనే కీవర్డ్స్ ను ఉపయోగించి గూగుల్ లో వెతకగా Lallantop లో అందుకు సంబంధించిన రిజల్ట్ దొరికింది. అందులో సోనూ సూద్ వలస కూలీలను సొంత ఊరికి చేర్చడానికి అప్పట్లో తన సామాజిక మాధ్యమాల్లో ఓ పోస్టును పెట్టారు.

సోనూ సూద్ తన ట్విట్టర్ ఖాతాలో కూడా హిందీలో ఓ పోస్టు పెట్టడం చూడొచ్చు.

NDTV కథనం ప్రకారం సోనూ సూద్ మే 26న ఈ టోల్ ఫ్రీ నెంబర్ ను లాంఛ్ చేశారు. వలస కూలీలను ఇంటికి చేర్చడానికి సోనూ సూద్ ఈ టోల్ ఫ్రీ నెంబర్ ను ఏర్పాటు చేశారు. ఎవరైతే సొంత ఊళ్లకు వెళ్ళాలని అనుకుంటున్నారో.. వాళ్లు ఈ నెంబర్ కు కాల్ చేయమని చెప్పాడు సోనూ సూద్..!

'ఎన్నో కాల్స్ రావడం మొదలైంది. వేలల్లో కాల్స్ వచ్చాయి. నా కుటుంబం, స్నేహితులు డేటాను కలెక్ట్ చేస్తూ ఉన్నారు. కొందరు సంప్రదించలేకుండా పోవచ్చు. అందుకోసమే కాల్ సెంటర్ ను ఏర్పాటు చేయాలని అనుకున్నాను. అందులో భాగంగానే టోల్ ఫ్రీ నెంబర్ ను ఏర్పాటు చేసాను. ప్రత్యేకంగా ఓ టీమ్ ను కూడా ఏర్పాటు చేసాము. వీలైనంత ఎక్కువ మందికి సహాయం చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాం. ప్రతి ఒక్కరికీ సహాయం చేయాలన్నదే నా ఆకాంక్ష' అంటూ సోనూ సూద్ PTI కి చెప్పుకొచ్చారు.

జులై 24, 2020 న సోనూ సూద్ మాట్లాడుతూ 'నేను వలస కూలీలను సొంత ఊళ్లకు పంపడానికి ఈ నెంబర్ ను ఏర్పాటు చేశాను. కిర్జికిస్థాన్ లో ఉన్న విద్యార్థులను కూడా భారత్ కు తీసుకుని రావడానికి ప్రయత్నం చేస్తున్నాం. 2000-4000 వరకూ విద్యార్థులు కిర్జికిస్థాన్ లో చాలా అవస్థలు పడుతున్నారు.. అందులో ఓ వ్యక్తి కూడా మరణించాడు. కిర్జికిస్థాన్ నుండి వారణాసి, వైజాగ్, ఢిల్లీ, హైదరాబాద్ లకు విమానాలను ఏర్పాటు చేశాము. వీళ్ళందరికీ సహాయం చేయడానికి దేవుడు నాకు అవకాశం ఇచ్చినందుకు ఎంతగానో ఆనందపడుతున్నానని' సోనూ సూద్ తెలిపారు. తాను చేసిన ఈ పనుల వల్ల ఎన్నో కుటుంబాల్లో చిరునవ్వు చూడగలుగుతున్నానని సోనూ సూద్ చెప్పుకొచ్చారు. ఎంతో మందికి సోనూ సూద్ సహాయం చేస్తూ రియల్ హీరో అని అనిపించుకుంటూ ఉన్నారు.

సోనూ సూద్ 1800 121 3711 అనే హెల్ప్ లైన్ ను ఏర్పాటు చేసింది నిజమే.

Next Story