పాకిస్తాన్‌ నుంచి వచ్చిన 30 వేల మంది కోసమే సీఏఏ..!

By అంజి  Published on  29 Dec 2019 8:58 AM GMT
పాకిస్తాన్‌ నుంచి వచ్చిన 30 వేల మంది కోసమే సీఏఏ..!

తిరుమల: బీజేపీ ఎంపీ సుబ్రమణ్యం స్వామి కాంగ్రెస్‌ పార్టీపై ఫైర్‌ అయ్యారు. పౌరసత్వ సవరణ చట్టంపై కాంగ్రెస్‌ అనవసర రాద్దాంతం చేస్తోందని మండిపడ్డారు. రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌(ఆర్‌ఎస్‌ఎస్‌)పై రాహుల్‌ గాంధీ చేసిన వ్యాఖ్యలను సుబ్రమణ్యం స్వామి ఖండించారు. రాహుల్‌ది ఫాసిస్ట్‌ ఫ్యామిలీ అని, పోలీసులపై ప్రియాంక గాంధీ దాడి చేసిందని, ఆమెపై కేసు పెట్టాలని డిమాండ్‌ చేశారు. మతపరమైన ఇబ్బందుల కారణంగా పాకిస్తాన్‌ నుంచి వచ్చిన 30 వేల మంది హిందువుల కోసమే ప్రధాని నరేంద్రమోదీ సీఏఏ చట్టం తీసుకోచ్చారని తెలిపారు. పాకిస్తాన్‌ నుంచి వచ్చిన ఏ ముస్లిం మతపరమైన ఇబ్బందులతో రాలేదన్నారు. రాజీవ్‌ గాంధీ హయాంలోనే ఎన్‌ఆర్‌సీ చేయమని సుప్రీంకోర్టు ఆదేశించిందన్నారు. అయితే గత ప్రభుత్వాలు పట్టించుకోలేదని.. తాము ఇప్పుడు చేసి చూపిస్తున్నామన్నారు. టీటీడీపై మతపరమైన ఆరోపణలు చేస్తున్నవారిపై కేసులు పెట్టాలని సుబ్రమణ్యం స్వామి అన్నారు. జగన్‌ ప్రభుత్వంపై ఉద్దేశపూర్వకంగా ఆరోపణలు చేస్తున్నారని వ్యాఖ్యనించారు.

తిరుమల పాలకమండలి స్వతంత్రంగా వ్యవహరిస్తోందన్నారు. తిరుమలలో అన్యమత ప్రచారం జరిగితే.. మొదట తానే స్పందిస్తానని బీజేపీ ఎంపీ సుబ్రమణ్యం స్వామి పేర్కొన్నారు. టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డిపై వస్తున్న ఆరోపణలు అసత్యమని.. తిరుమలలో ఎలాంటి మత ప్రచారాలు జరగడం లేదని తెలిపారు. టీటీడీ గౌరవ ప్రధాన అర్చకులుగా రమణ దీక్షితులు తిరిగి బాధ్యతలు స్వీకరించడం సంతోషకరమని సుబ్రమణ్యస్వామి అన్నారు. శ్రీవెంకటేశ్వర స్వామిని కేంద్రమంత్రి గుర్జర్‌, ఎంపీ శ్రీనివాస్‌రెడ్డిలతో కలిసి దర్శించుకున్నారు. అనంతరం స్వామి వారి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. టీటీడీ అభివృద్ధికి సీఎం జగన్‌ చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. స్వామి వారి ఆలయంలో గతంలో జరిగిన నిధుల దుర్వినియోగంపై సత్వరమే దర్యాప్తు చేయాలిన సుబ్రమణ్యస్వామి డిమాండ్‌ చేశారు.

Next Story