ఆర్థిక మాంద్యం భయాందోళనల నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న టెక్ కంపెనీల్లో ఉద్యోగాల కోత కొనసాగుతూనే ఉంది. మైక్రోసాఫ్ట్, అమెజాన్, గూగుల్, ట్విట్టర్ వంటి సంస్థలు ఇప్పటికే చాలా మంది ఉద్యోగులను ఇంటికి పంపించాయి. అధిక ద్రవ్యోల్భణం, గ్లోబల్ మాంద్యం భయాలు, వ్యయ నిర్వహణలో భాగంగా ఉద్యోగుల తొలగింపు తప్పడం లేదని ఆయా కంపెనీలు చెబుతున్నాయి. తాజాగా ఈ జాబితాలో మరో టెక్ దిగ్గజం యాహూ కూడా చేరింది.
తన యాడ్ టెక్ యూనిట్ పునర్నిర్మాణంలో భాగంగా తన సంస్థల్లో పని చేస్తున్న మొత్తం ఉద్యోగుల్లో 20 శాతం కంటే ఎక్కువ మందిని ఇంటికి పంపించే యోచనలో ఉంది. ఈ తొలగింపు వల్ల యాహూ టెక్ ఉద్యోగుల్లో 50 శాతం కంటే ఎక్కువ మందిపై అంటే దాదాపు 1600 కంటే ఎక్కువ మంది ఉద్యోగాలను కోల్పోనున్నారని కంపెనీ ఎగ్జిక్యూటివ్‌లను ఉటంకిస్తూ ఆక్సియోస్ తెలిపింది.
ఉద్యోగుల కోత ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. దీంతో ఎప్పుడు ఎవరి ఉద్యోగం పోతుందో అని ఐటీ ఉద్యోగులు గుబులు పడిపోతున్నారు.