వాట్సాప్ కు భారీ ఫైన్..!

WhatsApp Fined EUR 225 Million by Irish Data Privacy Watchdog.ఫేస్‌బుక్‌కు చెందిన ప్రముఖ మెసేజింగ్‌ యాప్‌

By తోట‌ వంశీ కుమార్‌  Published on  2 Sep 2021 3:00 PM GMT
వాట్సాప్ కు భారీ ఫైన్..!

ఫేస్‌బుక్‌కు చెందిన ప్రముఖ మెసేజింగ్‌ యాప్‌ వాట్సాప్‌కు భారీ జరిమానా విధించారు. ఐర్లాండ్‌కు చెందిన డేటా ప్రొటెక్షన్‌ కమిషన్‌ 225 మిలియన్‌ యూరోలను జరిమానాగా విధించింది. డేటా నిబంధనలు ఉల్లంఘించినందుకు ఈ జ‌రిమానా విధించారు. అంటే.. భారతీయ కరెన్సీ ప్రకారం సుమారు రూ.1950 కోట్లు. వ్యక్తుల డేటాను ఇతర ఫేస్‌బుక్‌ కంపెనీలతో పంచుకునే విషయంలో పారదర్శకత పాటించకపోవడంతో ఈ జరిమానా వేసినట్లు డీపీసీ చెబుతోంది. వాట్సాప్ వినియోగదారులకు వారి డేటా ఎలా ప్రాసెస్ చేస్తామో అన్న విషయాన్ని వారికి తెలియజేసేలా తగిన సమాచారం ఇవ్వకుండా వాట్సాప్‌ నిబంధనలను ఉల్లంఘించిందని డీపీసీ పేర్కొంది. ఈ అంశంపై 2018లో విచారణ ప్రారంభించి తాజాగా జరిమానా విధించింది.

ఇతర కంపెనీలతో ఫేస్ బుక్ ప్రజల డేటాను పంచుకోవడంపై పారదర్శకత లేదని ఐర్లాండ్ 225 మిలియన్ యూరోల జరిమానాను విధించింది. డేటా ప్రొటెక్షన్ కమీషన్ వాట్సాప్ పై ఈ చర్యలకు ఉపక్రమించింది. వాట్సాప్ మాత్రం జరిమానా కరెక్ట్ కాదని.. అప్పీల్ చేస్తున్నామని తెలిపింది.

జనరల్ డేటా ప్రొటెక్షన్ రెగ్యులేషన్ లేదా GDPR అని పిలువబడే EU నియమాలు అమలులోకి వచ్చిన తర్వాత, GDPR కింద ఐరిష్ వాచ్‌డాగ్ జారీ చేసిన రెండవ పెనాల్టీ అని.. అంతేకాకుండా అతిపెద్ద పెనాల్టీ అని చెబుతోంది. గత ఏడాది భద్రతా ఉల్లంఘన విషయంలో ట్విట్టర్‌కు 450,000 యూరోలు జరిమానా విధించింది. "మేము అందించే సమాచారం పారదర్శకంగా మరియు సమగ్రంగా ఉందని నిర్ధారించడానికి మేము పనిచేశాము మరియు దానిని కొనసాగిస్తాము. 2018 లో ప్రజలకు అందించిన పారదర్శకతకు సంబంధించి ఈ రోజు నిర్ణయంతో మేము విభేదిస్తున్నాము మరియు జరిమానాలు పూర్తిగా అసమానంగా ఉన్నాయి." అని వాట్సాప్ చెబుతోంది.

Next Story