సోషల్ మీడియాలో డిజిటల్ కంటెంట్ పై నియంత్రణ కోసం కేంద్ర ప్రభుత్వం బుధవారం నుంచి నూతన ఐటీ నిబంధనలు అమల్లోకి తెచ్చిన సంగతి తెలిసిందే. అయితే.. ఈ నిబంధనలు వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించేలా ఉన్నాయని ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించినట్లు తెలుస్తోంది. ఈ నిబంధనలను తక్షణమే నిలిపివేయాలని కోరింది. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా హైకోర్టులో పిటిషన్ వేసినట్లు వార్తాకథనాలు వచ్చాయి.
నూతన నిబంధనల ప్రకారం.. దేశ భద్రతకు, ప్రజల భద్రతకు హాని కలిగించే తప్పుడు పోస్టులు పెడితే.. వాటి మూలాలను సదరు సోషల్ మీడియా సంస్థలు ప్రభుత్వానికి వెల్లడించాల్సి ఉంటుంది. ఇది భారత రాజ్యాంగం ప్రకారం వ్యక్తుల గోప్యత హక్కులను ఉల్లంఘించడమేనని వాట్సాప్ ఆరోపిస్తున్నట్లు సమాచారం. వాట్సాప్‌లో ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్టెడ్ సందేశాలు ఉంటాయని, ఒకవేళ కొత్త ఐటీ నిబంధనలను అనుసరిస్తే ఆ ఎన్‌క్రిప్షన్‌ను పక్కన పెట్టాల్సి వస్తుందని వాట్సాప్ వాదిస్తోంది. అందువల్ల వెంటనే ఈ నిబంధనలను నిలిపివేయాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టులో వాట్సాప్ పిటిషన్ దాఖలు చేసిందని కథనాలు వస్తున్నాయి. అయితే ఈ పిటిషన్‌ను వాట్సాప్ స్వయంగా దాఖలు చేసిందా? లేదా? ఇంకా దీనిపై కోర్టు ఎప్పుడు విచారణ జరపనుందన్న వివరాలు ఇంకా తెలియరాలేదు.
అయితే.. కొత్త కేంద్రం ప్రభుత్వం ప్రకటించిన నిబంధనల అమలుకు చర్యలు చేపడతామని వాట్సాప్ మాతృ సంస్థ ఫేస్‌బుక్ చెప్పడం గమనార్హం.