హోమ్‌లోన్ ఈఎంఐలు చెల్లించ‌కపోతే..?

What are the Consequences of Missing a Home Loan EMI.సొంతిల్లు దాదాపుగా ప్ర‌తి ఒక్క‌రి క‌ల‌.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  28 Sep 2022 8:36 AM GMT
హోమ్‌లోన్ ఈఎంఐలు చెల్లించ‌కపోతే..?

సొంతిల్లు దాదాపుగా ప్ర‌తి ఒక్క‌రి క‌ల‌. డ‌బ్బులుంటే ఇల్లు క‌ట్టుకోవ‌డం సుల‌భ‌మ‌మే కానీ.. అంద‌రి ద‌గ్గ‌రి న‌గ‌దు ఉండ‌దు. అందుకునే బ్యాంకుల్లో, ఆర్థిక సంస్థ‌ల్లో రుణాలు తీసుకుని సొంతింటి క‌ల‌ను నిజం చేసుకుంటారు. మీరు తీసుకున్న రుణం ఆధారంగా 15 ఏళ్ల నుంచి 20 ఏళ్ల పాటు సుదీర్ఘ కాలం నెల‌వారీ వాయిదాలు చెల్లించాల్సి ఉంటుంది. ఒక్క నెల వాయిదా చెల్లించ‌క‌పోయినా ఇబ్బందిక‌ర ప‌రిస్థితులు త‌లెత్తుతాయి. మీరు గృహ రుణాన్ని ఎగ‌వేస్తే మీ ప్ర‌స్తుత, భ‌విష్య‌త్తు ఆర్థిక వ్య‌వ‌హారాల‌పై తీవ్ర ప‌రిణామాలుంటాయి. వ‌రుస‌గా మూడు హోమ్ లోన్ ఈఎంఐ(నెలసరి రుణ వాయిదా)ల‌ను చెల్లించ‌క‌పోతే ఎలాంటి ప‌రిణామాలుంట‌యో ఓ సారి చూద్దాం.

తొలిసారి వాయిదా క‌ట్ట‌క‌పోతే..

మీరు తీసుకున్న రుణానికి ఈఎంఐలు స‌క్ర‌మంగా చెల్లించాల్సి ఉంటుంది. ఒక‌వేళ తొలిసారి ఈఎంఐ క‌ట్ట‌క‌పోతే వెంట‌నే బ్యాంకు మీకు ఎస్ఎంఎస్‌, ఇ-మెయిల్ ద్వారా గుర్తు చేస్తుంది. మీ వెసులుబాటును బ‌ట్టి ఆన్‌లైన్‌లో చెల్లించ‌డానికి అవ‌స‌ర‌మైన లింక్ కూడా పంపుతుంది. చెల్లించాల్సిన‌ ఈఎంఐతో పాటు బ‌కాయి లోన్ మొత్తంపై 1 నుంచి 2 శాతం ఫైన్ కూడా వ‌సూలు చేయ‌వ‌చ్చు. ఒక‌సారి వాయిదాను చెల్లించేస్తే తిరిగి రుణ ఖాతాను పున‌రుద్ద‌రిస్తారు.

వ‌రుస‌గా రెండో వాయిదా కూడా క‌ట్ట‌క‌పోతే

వరుసగా రెండో వాయిదాను కూడా క‌ట్ట‌క‌పోతే అప్పుడు బ్యాంకు మిమ్మ‌ల్ని హెచ్చ‌రిస్తుంది. ఆల‌స్య రుసంతో పాటు రెండు నెల‌ల ఈఎంఐలు వెంట‌నే చెల్లించాల‌ని కోరుతుంది. అయితే.. మీ ఆర్థిక ప‌రిస్థితి దృష్ట్యా కొంత స‌మ‌యం ఇచ్చే అవ‌కాశం ఉంది. మూడో నెల‌లోనూ ఈఎంఐ క‌ట్ట‌క‌పోతే చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని హెచ్చ‌రిక‌లు జారీ చేస్తుంది. అంత‌వ‌ర‌కు తెచ్చుకోకూడ‌ద‌ని మీరు బావిస్తే వెంట‌నే బ‌కాయిలు క‌ట్టాల‌ని సూచిస్తుంది.

మూడో నెల‌లోనూ క‌ట్ట‌క‌పోతే..

వ‌రుస‌గా మీరు మూడో ఈఎంఐను క‌ట్ట‌క‌పోతే మీ రుణాన్ని బ్యాంకు లేదా ఆర్థిక సంస్థ మేజ‌ర్ డీఫాల్ట్ కింద ప‌రిగ‌ణిస్తుంది. అప్ప‌టి వ‌ర‌కు కూడా బ్యాంకు నుంచి మీకు హెచ్చ‌రిక‌లు జారీ అవుతూనే ఉంటాయి. బ‌కాయిలు చెల్లించెందుకు మూడు నెల‌ల స‌మ‌యం ఇస్తుంది. ఆ టైం దాటేలోపు గానీ, తర్వాత గానీ చెల్లించకపోతే సంబంధిత బ్యాంకు లేదా ఆర్థిక సంస్థలు.. మీ ఇంటిని వేలం ద్వారా ఇతరులకు విక్రయించి రుణం వసూలు ప్రక్రియ ప్రారంభిస్తాయి.

క్రెడిట్ స్కోర్‌పై రిమార్క్

ఈ ద‌శ‌కు చేరిందంటే మీ లోన్‌ను మొండి బ‌కాయిలో జాబితాలో చేరుస్తారు. అదే సంస్థ వ‌ద్ద ఇత‌ర రుణాలేమైనా ఉంటే వాటిని కూడా నిర‌ర్థ‌క ఆస్తుల ప‌రిధిలోకి తీసుకువ‌స్తారు. మీ హోంలోన్ ఒక‌సారి మేజ‌ర్ డిఫాల్ట్ కింద‌కు వెళ్లిందంటే అది మీ క్రెడిట్ స్కోర్‌పై తీవ్ర ప్ర‌భావం చూపుతుంది. క్రెడిట్ స్కోర్‌పై డిఫాల్టర్ లేదా ఎగవేత దారు అనే రిమార్క్ స్పష్టంగా కనిపిస్తుంది. అలా ఎగవేతదారు అనే రిమార్క్ వస్తే.. భవిష్యత్‌లో రుణం తీసుకోవడం కష్టతరంగా మారుతుందని ఆర్థిక వేత్తలు చెబుతున్నారు. క్రెడిట్ స్కోర్ పడిపోతుంది. ఈ క్రెడిట్ స్కోర్ ఆధారంగా రుణాలిచ్చే బ్యాంకులు.. అది తగ్గితే.. రుణాలపై ఎక్కువ వడ్డీ వసూలు చేస్తాయి.

ఏం చేయాలి..

ఆర్థిక ఇబ్బందుల కార‌ణంగా మీరు ఈఎంఐ చెల్లిచ‌క‌లేక‌పోతే వెంట‌నే బ్యాంకుతో చ‌ర్చించి లోన్ కాల‌ప‌రిమితి పెంచ‌మ‌ని కోరాలి. దీని వ‌ల్ల ఈఎంఐ మొత్తం త‌గ్గుతుంది. అటుపై మీ రుణ చెల్లింపునకు అవసరమైన నిధులను సమీకరించుకోవడానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలి. బంధు మిత్రుల నుంచి చేబదుళ్లతో ఈఎంఐలు చెల్లించే అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. చివ‌ర‌గా మీ ఇంటిని మీరే విక్ర‌యించి లోన్ పూర్తిగా చెల్లించే మార్గాన్ని ప‌రిశీలించాలి. అయితే.. దీనికి ముందు బ్యాంకును ఖ‌చ్చితంగా సంప్ర‌దించాలి.

Next Story