టయోటా కిర్లోస్కర్ వైస్ చైర్మన్ విక్రమ్ కన్నుమూత

Vikram Kirloskar, Toyota Kirloskar vice-chairman, dies of cardiac arrest at 64. ప్రముఖ పారిశ్రామికవేత్త, టయోటా కిర్లోస్కర్ మోటార్స్ వైస్ చైర్మన్ విక్రమ్ కిర్లోస్కర్ మంగళవారం

By అంజి  Published on  30 Nov 2022 5:10 AM GMT
టయోటా కిర్లోస్కర్ వైస్ చైర్మన్ విక్రమ్ కన్నుమూత

ప్రముఖ పారిశ్రామికవేత్త, టయోటా కిర్లోస్కర్ మోటార్స్ వైస్ చైర్మన్ విక్రమ్ కిర్లోస్కర్ మంగళవారం అర్థరాత్రి గుండెపోటుతో మరణించారు. ఆయన వయసు 64. గుండెపోటు రావడంతో ఆయన బెంగళూరులో ఆయన చనిపోయారు. అతని మరణాన్ని టయోటా మోటార్స్ ఇండియా ధృవీకరించింది. ''నవంబర్ 29, 2022న టయోటా కిర్లోస్కర్ మోటార్ వైస్ చైర్మన్ విక్రమ్ ఎస్. కిర్లోస్కర్ అకాల మరణాన్ని తెలియజేసేందుకు మేము చాలా బాధపడుతున్నాం. ఈ దుఃఖ సమయంలో, ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రతి ఒక్కరూ ప్రార్థిస్తున్నాము. అతని కుటుంబ సభ్యులకు, స్నేహితులకు మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాము. బెంగళూరులోని హెబ్బాల్ శ్మశానవాటికలో 30 నవంబర్ 2022 మధ్యాహ్నం 1 గంటలకు అంతిమ కార్యక్రమాలు జరుగుతాయి'' అని టయోటా ఇండియా ఒక ట్వీట్‌లో తెలిపింది.

మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుండి మెకానికల్ ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ అయిన విక్రమ్ 1997లో జపనీస్ కంపెనీ టయోటా మోటార్ కార్ప్‌ను భారతదేశానికి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించాడు. టయోటా-కిర్లోస్కర్‌కు బెంగళూరు సమీపంలోని రామనగర్ జిల్లా బిడాడిలో తయారీ ప్లాంట్ ఉంది. దేశంలోని అతిపెద్ద ఆటోమోటివ్ ప్లాంట్లలో ఒకటి. అతను 1888లో స్థాపించబడిన కిర్లోస్కర్ గ్రూప్‌లో నాల్గవ తరం సభ్యుడు. అతనికి భార్య గీతాంజలి కిర్లోస్కర్, కుమార్తె మానసి కిర్లోస్కర్ ఉన్నారు.

కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై విక్రమ్‌ను దేశంలోని ఆటోమోటివ్ పరిశ్రమలో అగ్రగామిగా కొనియాడారు. ''భారత ఆటోమోటివ్ పరిశ్రమ యొక్క ప్రముఖులలో ఒకరైన, టయోటా కిర్లోస్కర్ మోటార్ వైస్ చైర్‌పర్సన్ విక్రమ్ కిర్లోస్కర్ మరణం పట్ల సంతాపం. అతని ఆత్మకు శాంతి కలుగుగాక. ఈ నష్టాన్ని తట్టుకునే శక్తిని కుటుంబ సభ్యులకు, స్నేహితులకు భగవంతుడు ప్రసాదిస్తాను'' అని ముఖ్యమంత్రి ట్వీట్ చేశారు. కర్ణాటక రాష్ట్రంలో ప్రధాన ఆటోమొబైల్ తయారీ పరిశ్రమను ప్రారంభించడానికి విక్రమ్‌ పూర్తిగా బాధ్యత వహించాడు. ఇందుకుగాను ప్రభుత్వం గుర్తించి 'సువర్ణ కర్ణాటక' అవార్డును అందజేసింది.



Next Story