ట్విట్టర్‌కు భారీ షాక్.. కోల్పోయిన 'మధ్యవర్తి హోదా'.. తొలి కేసు నమోదు..!
Twitter loses its status as intermediary platform in India.ప్రముఖ సోషల్ మీడియా సంస్థ ట్విటర్‌కు భారీ షాక్
By తోట వంశీ కుమార్ Published on 16 Jun 2021 5:08 AM GMTప్రముఖ సోషల్ మీడియా సంస్థ ట్విటర్‌కు భారీ షాక్ తగిలింది. నూతన ఐటీ నిబంధనలను అమలు చేయనందుకు గానూ భారత్‌లో ఉన్న చట్టపరమైన రక్షణ(మధ్యవర్తి హోదా)ను కేంద్ర ప్రభుత్వం ఎత్తేసింది. నూతన నిబంధనల ప్రకారం.. కొందరు కీలక అధికారులను ట్విటర్ నియమించాల్సి ఉన్నా.. ఆ సంస్థ ఆ పని చేయడంలో విఫలమైన కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు బుధవారం కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. దీంతో యూజర్లు అభ్యంతరకర పోస్టులకు ఇకపై ట్విటర్ కూడా క్రిమినల్ కేసులు, ఇతరత్రా చర్యలు ఎదుర్కొవాల్సి వస్తుంది. మధ్యవర్తి హోదా ఎత్తివేసిన వెంటనే ఉత్తర ప్రదేశ్‌లో ట్విటర్‌పై తొలి కేసు కూడా నమోదవడం గమనార్హం. మతపరమైన హింసను ప్రోత్సహించే ట్వీట్ల కారణంగా ఆ సంస్థపై ఈ కేసు పెట్టారు.
సామాజిక మాధ్యమాల్లో డిజిటల్ కంటెంట్ పై నియంత్రణకు గానూ కేంద్రం తీసుకువచ్చిన నూతన ఐటీ నిబంధనలు మే 25 నుంచి అమల్లోకి వచ్చాయి. 50లక్షలు దాటిన సామాజిక మాధ్యమాలు ఓ ఫిర్యాదుల అధికారిని, ఓ నోడల్ అధికారిని, అనుసంధానకర్తగా మరో ప్రధాన అధికారిని నియమించుకోవాల్సి ఉంటుంది. ఈ ముగ్గురూ భారత్‌లో నివసిస్తూ ఉండాలి. ఇతర సోషల్ మీడియా సంస్థలు ఈ నిబంధనలు పాటించినప్పటికి ట్విట్టర్ మాత్రం దీనిని పాటించలేదు. ట్విటర్‌కు ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేస్తూనే ఉంది. ట్విటర్ స్పందించకపోవడంతో జూన్ మొదటి వారంలో కేంద్రం ట్విటర్‌కు తుది నోటీసులు జారీ చేసింది. దీనిపై కూడా ట్విటర్ స్పందించకపోవడంతో ట్విటర్ తన మధ్యవర్తి హోదాను కోల్పోయినట్లు కేంద్ర వర్గాలు బుధవారం వెల్లడించాయి. ఇకపై అభ్యంతరకర పోస్టులకు సంబంధించిన కేసుల్లో భారత చట్టాలకు అనుగుణంగా ట్విటర్ కూడా క్రిమినల్ కేసులు ఎదుర్కోవాల్సి ఉంటుందని తెలిపాయి. అయితే..మధ్యవర్తి హోదా రద్దుపై ఇంత వరకు అధికారికంగా ఎలాంటి ఉత్తర్వులు జారీ కాలేదు. కాగా.. భారత్‌లో ఈ హోదా కోల్పోతున్న తొలి సోషల్ మీడియా ఇదే కావడం గమనార్హం
తొలి కేసు నమోదు
ఉత్తరప్రదేశ్‌లో థర్డ్ పార్టీ కంటెంట్ కలిగి ఉన్నదంటూ ట్విటర్‌పై కేసు నమోదైంది. ఈ నెల 5న ఓ ముస్లిం వ్యక్తిపై దాడి చేసిన ఘటనపై దర్యాప్తు చేపట్టిన ఘజియాబాద్ పోలీసులు ట్విటర్, కొందరు జర్నలిస్టులపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ ఘటనకు సంబంధించి తప్పుదోవ పట్టించే సమాచారాన్ని ట్విటర్ తొలగించలేదని ఎఫ్ఐఆర్‌లో పోలీసులు వెల్లడించారు.