ట్విట్టర్ సేవల్లో అంతరాయం కలిగింది. శుక్రవారం ఉదయం నుంచి దేశ వ్యాప్తంగా పలువురు యూజర్లకు లాగిన్ సమస్యలు తలెత్తాయి. లాగిన్ చేసేందుకు యత్నిస్తున్న సమయంలో ఎర్రర్ మెసేజ్ చూపిస్తోంది. ఈ విషయాన్ని ఇతర సోషల్ మీడియాల్లో యూజర్లు ఫిర్యాదులు చేస్తున్నారు. ఈ రోజు తెల్లవారుజామున మూడు గంటల నుంచే ఈ సమస్య మొదలైందని, ఉదయానికి మరింత మందికి లాగిన్ సమస్యలు వచ్చినట్లు తెలుస్తోంది. అయితే.. మొబైల్ యూజర్లకు ఎలాంటి సమస్య ఉత్పన్నం కాలేదని సమాచారం.
డెస్క్‌టాప్ యూజర్లకు "సమ్‌థింగ్ వెంట్ రాంగ్" అనే ఎర్రర్ మెసేజ్ చూపిస్తోంది. కొత్త ఫీచర్ మార్పులు కారణంగా సమస్య ఏర్పడిందా..? అందుకోసమే డౌన్‌టైమ్ ప్లాన్ చేశారా అనేది తెలియరాలేదు. దీనిపై ట్విట్టర్ నుంచి ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన మాత్రం రాలేదు.
టెస్లా అధినేత ఎలాన్ మస్క్ గత వారం ట్విట్టర్‌ను కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అనేక మార్పులకు మస్క్ శ్రీకారం చుట్టాడు. ఉద్యోగులను తొలగించడంతో పాటు బ్లూటిక్ కు ఛార్జీలు వసూలు చేయడం వంటి నిర్ణయాలు తీసుకున్నాడు. ఈ క్రమంలోనే తాజాగా ట్విట్టర్ సేవల్లో అంతరాయం ఏర్పడడం గమనార్హం.