హోం లోన్‌ తీసుకోవాలనుకుంటున్నారా?.. అయితే ఇవి పక్కాగా ఉండాల్సిందే

సొంతింటి కల నెరవేరితే కలిగే ఆనందమే వేరు. ఈ కలను నిజం చేసుకోవడానికి చాలా మంది అనేక ప్రయత్నాలు చేస్తుంటారు.

By అంజి  Published on  27 Jun 2024 5:45 PM IST
home loan, home loan documents, Credit score, Bank, financial company

హోం లోన్‌ తీసుకోవాలనుకుంటున్నారా?.. అయితే ఇవి పక్కాగా ఉండాల్సిందే

సొంతింటి కల నెరవేరితే కలిగే ఆనందమే వేరు. ఈ కలను నిజం చేసుకోవడానికి చాలా మంది అనేక ప్రయత్నాలు చేస్తుంటారు. ఎందుకంటే ఇది తమ జీవితంలో తీసుకునే అతిపెద్ద ఆర్థిక నిర్ణయాలలో ఒకటి. దీని కోసం ఎంత ధనం పొదుపు చేసినా.. మరికొంత డబ్బు కోసం బ్యాంకుకు వెళ్లాల్సిందే, లోన్‌ తీసుకోవాల్సిందే. అయితే ఈ రుణం పొందడం అనుకున్నంత సులువు కాదు. దీని కోసం కొన్ని ఫార్మాలిటీలను పూర్తి చేయాలి. తొలిసారి రుణం పొందాలనుకున్నవారు అనేక విషయాలు తెలుసుకోవాలి. దీని కోసం సరైన బ్యాంకును ఎంచుకోవాలి. వీలైనన్ని బ్యాంకులు తిరగాలి. అందులో తక్కువ వడ్డీ, మంచి ఆఫర్లు ఇచ్చే నమ్మశక్యమైనా బ్యాంకుల్లో రుణం తీసుకోవాలి. అయితే దరఖాస్తుదారులకు లోన్‌ ఇచ్చేటప్పుడు బ్యాంకులు కొన్ని విషయాలను పరిగణనలోకి తీసుకుంటాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

క్రెడిట్‌ స్కోర్‌: గతంలో మీరు తీసుకున్న రుణాన్ని ఎంత బాగా చెల్లించారో ఈ క్రెడిట్‌ స్కోర్‌ తెలుపుతుంది. సాధారణంగా క్లీన్‌ క్రెడిట్‌ హిస్టరీ ఉన్నవారికే బ్యాంకుల్లో రుణాలు ఇస్తుంటారు. తక్కువ వడ్డీ డిమాండ్‌ చేయాలన్న.. అధిక మొత్తంలో లోన్‌ కావాలన్నా ఈ క్రెడిట్‌ స్కోర్‌ ఉపయోగపడుతుంది. ఇందులోని స్కోర్‌ ద్వారానే రుణం ఇచ్చేవారు ఎంత లోన్‌ ఇవ్వాలి? ఎంత వడ్డీ ఇవ్వాలి? అనే నిర్ణయం తీసుకుంటారు. సిబిల్‌ స్కోర్‌ ఎప్పుడూ 750 కన్నా ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి.

వడ్డీరేటు: లోన్‌ తీసుకున్నందుకు బ్యాంకుకు చెల్లించే అదనపు డబ్బే ఈ వడ్డీరేటు. దీని గురించి కచ్చితంగా తెలుసుకోవాలి. ఈ రుణం అధిక మొత్తంతో కూడుకున్నది కాబట్టి దీర్ఘకాలం పాటు ఈఎంఐ కట్టాల్సి ఉంటుంది. వడ్డీ రేటు అధికం అయితే.. కట్టాల్సిన డబ్బు కూడా అధికం అవుతుంది. కాబట్టి ఇంటి రుణం పొందాలి అనుకున్న వారు అనేక సంస్థల వడ్డీ రేట్లను తనిఖీ చేసి వివిధ బ్యాంకుల రేట్లతో సరిపోల్చి నిర్ణయం తీసుకోవాలి.

కాల వ్యవధి: బ్యాంకులు దరఖాస్తుదారుని అర్హతను బట్టి 30 ఏళ్ల కాల వ్యవధితో కూడా లోన్‌లు ఇస్తూ ఉంటాయి. అయితే, ఇంటి రుణం దీర్ఘకాలిక నిబద్ధత ఉన్నది కాబట్టి, చాలా కాలం పాటు సౌకర్యవంతంగా తిరిగి చెల్లించగలిగే రుణ మొత్తాన్ని ఎంచుకోవాలి.

వీటి గురించి తెలుసుకోండి

ప్రాసెసింగ్‌ ఫీజు, పన్ను ప్రయోజనాలు, గృహ బీమా, డౌన్‌ పేమెంట్, ఈఎంఐ, డాక్యుమెంటేషన్‌ వంటి ఇతర ఫ్యాక్టర్ల గురించి కూడా వివరంగా తెలుసుకోవాలి. ఒక్కసారి ఓ బ్యాంకు నుంచి రుణం తీసుకున్న తర్వాత.. దాని కన్నా మంచి లోన్‌ గురించి ఆలోచించినా ప్రయోజనం ఉండదు. అన్ని విషయాలు సమగ్రం తెలుసుకొని, సంతృప్తి చెందిన తర్వాతే రుణం తీసుకోవాలి. ఈఎంఐలు సక్రమంగా చెల్లించకపోతే అది క్రెడిట్‌ స్కోర్‌పై ప్రతికూల ప్రభావం చూపుతుంది. వాయిదాలను సక్రమంగా చెల్లించనట్టయితే బ్యాంకులు చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చు. వాటిని రికవరీ చేయడానికి మీ ఆస్తిని కూడా విక్రయించవచ్చు. అందుకే భవిష్యత్తు ఆర్థిక పరిస్థితిని ముందుగానే అంచనా వేయాలి. సామర్థ్యానికి మించి లోన్‌ తీసుకోవడం అంటే ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి వీలు లేకుండా దిగజారిపోవడమే అని అర్థం చేసుకోవాలి.

Next Story