దారుణం.. లిఫ్ట్ అడిగి.. ఇంజక్షన్ గుచ్చి.. ప్రాణం తీశారు
Stranger kills biker after asking for lift in Khammam district.సాయం చేయడమే అతడు చేసిన పాపమైంది.
By తోట వంశీ కుమార్ Published on 20 Sept 2022 7:23 AM ISTసాయం చేయడమే అతడు చేసిన పాపమైంది. తాను వెళ్లే దారిలోనే గదా అని గుర్తు తెలియని వ్యక్తి కి లిఫ్ట్ ఇచ్చాడు. లిఫ్ట్ అడిగి బండి ఎక్కిన వ్యక్తి వెనుక నుంచి ఇంజక్షన్ గుచ్చి సాయం చేసిన వ్యక్తి ప్రాణాలు తీశాడు. ఈ ఘటన ఖమ్మం జిల్లాలోని ముదిగొండ మండలంలో జరిగింది.
పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. చింతకాని మండలం బొప్పారంలో షేక్ జమాల్ సాహెబ్(48) తన కుటుంబంతో కలిసి నివసిస్తున్నాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని జగ్గయ్యపేట మండలం గండ్రాయి గ్రామంలో ఉండే పెద్ద కుమార్తె ను చూసేందుకు మూడు రోజుల క్రితం జమాల్ భార్య ఇమాంబీ వెళ్లింది. భార్యను తీసుకువచ్చేందుకు సోమవారం ఉదయం బొప్పారం నుంచి ద్విచక్రవాహనంపై జమాల్ బయలుదేరాడు. ముదిగొండ మండలం వల్లభి సమీపంలోకి రాగానే మాస్క్ ధరించిన ఇద్దరు వ్యక్తులు అతడిని ఆపి లిఫ్ట్ అడిగారు.
తమ బండిలో పెట్రోల్ అయిపోయిందని, ఇద్దరిలో ఒకరికి దగ్గరిలో ఉన్న పెట్రోల్ బంకు వరకు లిఫ్ట్ ఇవ్వాలని కోరడంతో జమాల్ అందుకు అంగీకరించాడు. కొంచెం దూరం ప్రయాణించగానే ఆ ఆగంతకుడు జమాల్ వీపు మీద ఇంజెక్షన్‌తో పొడిచాడు. ఏదో గుచ్చుకున్నట్లుగా అనిపించడం, కళ్లు బైర్లు కమ్ముతుండడంతో జమాల్ వాహనాన్ని స్లో చేయగానే.. ఆ ఆగంతకుడు బండి నుంచి కిందకు దూకి వెనుకాలే వస్తున్న మరో నిందితుడి బండెక్కి పారిపోయాడు. స్పృహ తప్పి కిందపడిపోయిన జమాల్‌ను మల్లారం గ్రామానికి చెందిన తిరుపతిరావు, శివలు గుర్తించి నీళ్లు చల్లగా స్పృహలోకి రాగా.. వివరాలు ఆరా తీశారు.
జమాల్ తన భార్యతో మాట్లాడించాలని ఫోన్ ఇచ్చి పాస్‌వర్డ్ కూడా చెప్పాడు. ఫోన్‌లో అతడి భార్య, కూతురుతో పాటు అల్లుడు షేక్ లాల్‌సాహెచ్‌కు సమాచారం ఇచ్చారు. స్థానికులు జమాల్‌కు సపర్యలు చేసి ఆస్పత్రికి తరలించగా అప్పటికే అతడు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
కాగా.. జమాల్ కన్నా ముందు మైసయ్య అనే వ్యక్తిని నిందితులు లిఫ్ట్ అడిగారు. అతడు బైక్‌ను ఆపినా.. ఎక్కకుండా పంపించి వేశారు. అనంతరం వచ్చిన జమాల్ బండిని ఆపి దారుణానికి పాల్పడ్డారు. దీన్ని బట్టి పథకం ప్రకారమే హత్య చేసినట్లుగా భావిస్తున్నారు. అయితే.. హత్యకు గల కారణాలు తెలియరాలేదు. మృతుడి రక్తం, అవయవాల నమూనాలను సేకరించి వరంగల్‌లోని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు. మత్తు మందు ఇవ్వడం వల్ల చనిపోయాడా..? లేక ఇంకేదైనా రసాయనం ఇచ్చారా అన్నది పోస్టుమార్టం నివేదిక వచ్చాకే తెలుస్తుందని పోలీసులు తెలిపారు.