కరోనా మహమ్మారి వల్ల ప్రపంచ దేశాలన్నీ వణికిపోయాయి. ఇక సామాన్యుడి జీవితాన్ని అతలాకుతలం చేసింది. ఎంతో మందికి తమ కుటుంబ పెద్దలను దూరం చేసింది. దీంతో చాలా కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ధరలు పెరుగుతుండడంతో సామాన్యుడు ఏం కొనేటట్లు లేదు అన్నట్లు పరిస్థితులు మారిపోతున్నాయి. నిత్యావసరాల ధరలతో పాటు చమురు ధరలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. దీంతో వాహనాలను తీయాలంటేనే ప్రజలు జంకుతున్నారు. అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు పెరుగుతున్నప్పటికీ.. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఉండడంతో గత కొద్ది రోజులుగా మన దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉంటున్న సంగతి తెలిసిందే.
అయితే.. శ్రీలంకలో చమురు ధరలు చుక్కులను తాకుతున్నాయి. తాజాగా లీటర్ పెట్రోల్ పై రూ.20, డీజిల్ రూ.15 పెరిగింది. ఫలితంగా లంకలో ప్రస్తుతం లీటర్ పెట్రోల్ రూ.204కి చేరగా.. డీజిల్ ధర రూ.139కి చేరింది. ఇక అక్కడ గత నెలలో రికార్డు స్థాయిలో ద్రవ్యోల్భణం 25 శాతం పెరిగింది. లంకలో ఒక్క చమురే కాదు ఇతర నిత్యావసర వస్తువుల ధరలు సైతం ఆకాశాన్ని తాకుతున్నాయి. ప్రధానంగా పర్యాటక ఆధారిత ఆర్థిక వ్యవస్థ అయిన లంకకు.. కరోనా రూపంలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కరోనా వల్ల లంక ఎగుమతులు భారీగా దెబ్బతిన్నాయి. దిగుమతులపై పలు దేశాలు నిషేదం విధించడంతో నిత్యావసరాల ధరలు భారీగా పెరిగాయి.