రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. బ్యాంకింగ్ రూల్స్‌ను కఠినతరం చేసింది. ఆర్‌బీఐ బాసెల్ III ఫ్రేమ్‌వర్క్ కింద కొత్త లిక్విడిటీ ప్రమాణాలను వివరిస్తూ జూలై 25న డ్రాఫ్ట్ నిబంధనలను విడుదల చేసింది. ఇంటర్నెట్, మొబైల్ బ్యాంకింగ్ ద్వారా చేసే డిపాజిట్లకు బ్యాంకులు అదనపు రిస్క్ వెయిటింగ్‌లను వర్తింపజేయాలని కొత్త నిబంధనలు సూచిస్తున్నాయి.
అమెరికాలో సిలికాన్ వ్యాలీ బ్యాంకు దివాలా పరిస్థితులు ఇక్కడ తలెత్తకుండా జాగ్రత్త పడుతోంది. లిక్విడిటీ రేషియో నిబంధనలు మార్చింది. ఇంటర్‌నెట్, మొబైల్ బ్యాంకింగ్ సేవలున్న అస్థిర డిపాజిట్ల రన్ ఆఫ్ ఫ్యాక్టర్‌ను 5 శాతం నుంచి 15 శాతంకు చేర్చింది. స్థిర డిపాజిట్లకు 10 శాతంగానే ఉంచింది. డిజిటల్ అకౌంట్లలోని డబ్బును 'హాట్ మనీ'గా వర్ణించింది. వీటిని అత్యధిక 'ఫ్లైట్ రిస్క్' కేటగిరీల్లో చేర్చింది.
రన్ ఆఫ్ అంటే..
బ్యాంకులు, ఆర్థిక సంస్థల ఊహకు అందకుండా వేలాది కస్టమర్లు డిపాజిట్లను విత్‌డ్రా చేయడాన్ని రన్ ఆఫ్స్ అంటారు. అప్పుడు లిక్విడిటీ కొరత తలెత్తి బ్యాంకుపై ఒత్తిడి పెరిగి దివాలా తీయొచ్చు. ఇదొక చైన్ ఆఫ్ రియాక్షన్‌గా మారి మిగతా బ్యాంకులపై ప్రభావం పడొచ్చు. యూఎస్‌లో ముందు సిలికాన్ వ్యాలీ బ్యాంకుకు ఇలాగే అయ్యింది. ఈ ప్రభావంతో మరికొన్ని చిన్న బ్యాంకులు కుప్పకూలాయి. అందుకే ఆర్‌బీఐ ఇక్కడ రన్ ఆఫ్ ఫ్యాక్టర్‌ను పెంచింది.