ఆర్‌బీఐ వార్షిక నివేదికలో ఆసక్తికర విషయాలు..
RBI announces no fresh supply of Rs 2000 currency notes in FY22.2021-22 ఆర్థిక సంవత్సరంలో దేశంలో కొత్తగా
By తోట వంశీ కుమార్ Published on 29 May 2021 2:44 AM GMT2021-22 ఆర్థిక సంవత్సరంలో దేశంలో కొత్తగా రూ.2వేల నోట్లను ముద్రించడం లేదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) చెప్పింది. ఈ ఆర్థిక సంవత్సరంలో కొత్త రూ.2వేల నోట్లను చలామణిలోకి తీసుకువచ్చే ఆలోచన లేదని ఆర్‌బీఐ తమ వార్షిక నివేదికలో వెల్లడించింది. గత రెండేళ్లుగా రూ. 2వేల కరెన్సీని ముద్రించడం ఆర్‌బీఐ నిలిపివేసింది. చలామణీలో ఉన్న రూ.2వేల నోట్ల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తోంది. 2019-20లో రూ.2000 నోట్ల విలువ రూ.5,47,952 కోట్లు ఉండగా 2020-21 నాటికి రూ.4,90,195 కోట్లకు పడిపోయింది. అంటే,రూ.57,757 కోట్ల విలువ గల రూ.2000 నోట్లు మార్కెట్‌లో చలామణిలో లేకుండా పోయాయి.
రూ.500, రూ.2,000 నోట్లు ఆర్ధికవ్యవస్థలో చెలామణిలో ఉన్న నోట్లలో అత్యధిక కరెన్సీ విలువను కలిగి ఉన్నాయి. చెలామణిలో ఉన్న బ్యాంక్ నోట్ల విలువలో వీటి విలువ 85.7 శాతం. గత ఏడాది 83.4 శాతంతో పోలిస్తే కొంచెం ఎక్కువ. నోట్ల ముద్రణ పరంగా చెలామణిలో ఉన్న అన్ని బ్యాంక్ నోట్లలో రూ.500 నోట్ల సంఖ్యే 31.1 శాతం. ఆర్‌బీఐ గత సంవత్సరం వార్షిక నివేదికలో, భద్రతా సమస్యల కారణంగా తాత్కాలికంగా రూ.2000 నోటు ముద్రణను నిలిపివేసినట్లు తెలిపింది. 2018 నుంచి వ్యవస్థలో రూ.2,000 నోట్లు తగ్గుతూ వస్తున్నాయి.
2018 మార్చి నాటికి 33,632 లక్షలు ఉండగా, 2019 మార్చి చివరి నాటికి 32,910 లక్షల నోట్లు, 2020 చివరి నాటికి 27,398 లక్షల నోట్లకు తగ్గిపోయాయి. బ్లాక్ మనీకి అడ్డుకట్ట వేసేందుకు 2016 నవంబర్ 8న కేంద్ర ప్రభుత్వం పాత రూ.500 నోటు, పాత రూ.1,000 నోటును రద్దు చేసిన విషయం తెలిసిందే. పాత రూ.1,000 నోటు స్థానంలో రూ.2,000 నోట్లను చెలామణిలోకి తీసుకొచ్చింది. కాగా.. క్రమంగా రూ.2వేల నోటు చలామణి తగ్గుతుండడంతో ఆర్‌బీఐ భవిషత్తులో దీన్ని ఉపసంహరించుకోవచ్చునన్న వాదన ఉంది. ఏది ఏమైనా కొత్త నోట్ల ముద్రణ ఆగిపోయిందని మాత్రం ఆర్‌బీఐ స్పష్టం చేసింది.