దేశవ్యాప్తంగా మహిళలు, నవజాత శిశువుల భవిష్యత్తు కోసం కేంద్ర ప్రభుత్వం అనేక ముఖ్యమైన చర్యలు చేపడుతుంది. తొలిసారి గర్భవతి అవుతున్న మహిళల సంక్షేమం కోసం జనవరి 2017లో ప్రారంభించిన ప్రధాన్ మంత్రి మాతృ వందన యోజన (పీఎంఎంవీవై) కింద ఇప్పటి వరకు అనేక మంది మహిళలు ఆర్థిక సాయం అందుకున్నారు. ఈ పథకం కింద గర్భిణీ స్త్రీలకు, తల్లి పాలిచ్చే మహిళలకు రూ.5000 ఆర్థిక సాయం అందతుంది. మూడు వేర్వేరు వాయిదాలలో రూ .5000 అందిస్తారు. అయితే.. 19 ఏళ్లకు ముందే గర్భవతి అయిన మహిళలకు ఈ పథకం కింద ప్రయోజనం లభించదు.
ఈ పథకం యొక్క ముఖ్య లక్ష్యం ప్రెగ్నెన్సీ సమయంలో మహిళలకు సాయం చేయడం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో పని చేస్తున్న మహిళలకు ఈ పథకం వర్తించదు. ఈ పథకం రోజువారీ వేతనంతో పనిచేస్తున్న లేదా ఆర్థికంగా వెనకబడి ఉన్న మహిళలకు వర్తిస్తుంది. ప్రధాన మంత్రి మాతృ వందన పథకం కింద గర్భం దాల్చిన 150 రోజుల్లోపు గర్భిణి రిజిస్ట్రేషన్‌పై మొదటి విడతగా రూ .1000 ఆర్థిక సాయం అందుకోవచ్చు. రెండో విడతగా రూ. 2000లను 180 రోజుల్లో అందిస్తారు. మూడవ విడత డెలివరీ తర్వాత రూ. 2000 అందిస్తారు. అప్పటికీ బిడ్డకు బీసీజీ, ఓపీవీ, డీపీటీ, హెపటైటిస్ బి వంటి ఇంజెక్షన్లు వేయించి ఉండాలి.