కరోనా కష్టకాలం నుంచి ఇంకా కోలుకోనేలేదు. అన్ని వస్తువుల ధరలు పెరుగుతున్నాయి. ఓ వైపు నిత్యావసరాల ధరలు పెరుగుతుండగా.. తాజాగా భవన నిర్మాణ సామాగ్రి ధరలు పెరిగాయి. ఫలితంగా సామాన్యుడి సొంటింటి కల మరింత ప్రియం కానుంది. ఈ నెల(ఫిబ్రవరి) 1 నుంచి సిమెంట్ బస్తా ధరలను పెంచుతూ అన్ని కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. ఒక్కో బస్తాపై రూ.20 నుంచి రూ.50 వరకు పెంచాయి. ఫలితంగా తెలుగు రాష్ట్రాల్లో(ఏపీ, తెలంగాణ)లలో బ్రాండ్ ఆధారంగా సిమెంట్ ధర రూ.310 నుంచి రూ.400 వరకు ఉంది. గతేడాది నవంబర్ వరకు డిమాండ్ తక్కువగా ఉండటంతో కంపెనీలు రేట్లను తగ్గించాయి. అయితే.. ఈ ఏడాది జనవరి నుంచి డిమాండ్ పెరగడంతో పాటు ముడి పదార్థాల రేట్లు పెరగడంతో సిమెంట్ ధరలను పెంచినట్లు కంపెనీలు చెబుతున్నాయి.
దీంతో సామాన్యుడి సొంతిటి కల మరింత ప్రియం కానుంది. పెరుగుతున్న ధరలతో సగటు సామాన్యుడు ఇల్లు కట్టుకోవాలంటే భారీగా నగదును ఖర్చు చేయాల్సి వస్తోంది. ఇంటి నిర్మాణానికి అవసమయ్యే సిమెంట్, ఐరన్, ఇసుక ఇలా అన్నింటి ధరలు పెరిగాయి. దీంతో నిర్మాణ వ్యయం భారీగా పెరుగుతోంది. ఇప్పటికే ఇంటి నిర్మాణాలకు కీలకమైన ఐరన్ ధరలు పెంచాయి కంపెనీలు. ఇటు సామాన్యుడిపైనే కాకుండా.. నిర్మాణ రంగంపై కూడా పెరిగిన ధరలు ప్రభావం పడుతోంది.