రేపటి నుంచి మారేవి ఇవే

New NACH rules effective from August 1.ఆగ‌స్టు 1వ తేదీ నుంచి ఏటీఎం లావాదేవీలు, ఎల్‌పీజీ ధరలు,

By తోట‌ వంశీ కుమార్‌  Published on  31 July 2021 7:41 AM GMT
రేపటి నుంచి మారేవి ఇవే

ఆగ‌స్టు 1వ తేదీ నుంచి ఏటీఎం లావాదేవీలు, ఎల్‌పీజీ ధరలు, వేతనాలు, పెన్షన్లు ఇలా చాలా అంశాలకు సంబంధించి కొత్త రూల్స్ అమల్లోకి వస్తున్నాయి. మ‌రి రేప‌టి నుంచి జ‌ర‌గబోయే మార్పులేంటో ఓ సారి చూద్దాం..

గ్యాస్ ధ‌ర‌లు

ఆయిల్ కంపెనీలు ప్రతీ నెల ఒకటో తేదీన ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధరల్ని సవరిస్తూ ఉంటాయి. అంత‌ర్జాతీయ మార్కెట్ ధ‌ర‌ల‌కు అనుగుణంగా ఈ ధ‌ర‌ల‌ను స‌వ‌రిస్తుంటారు. జులైలో గ్యాస్ సిలిండర్ ధర పెరిగింది. మరి ఆగస్టులో సిలిండర్ ధర పెరుగుతుందా, తగ్గుతుందా అన్న విషయం ఆగస్ట్ 1న తెలుస్తుంది.

ఏటీఎం విత్‌డ్రా చార్జీలు పెంపు

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) ఇటీవల ఏటీఎం ఇంటర్‌ఛేంజ్ ఫీజును పెంచిన సంగతి తెలిసిందే. ఆగస్ట్ 1 నుంచి ఏటీఎంలో ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్‌కు ఇంటర్‌ఛేంజ్ ఫీజు రూ.17 చెల్లించాలి. నాన్ ఫైనన్షియల్ ట్రాన్సాక్షన్‌కు రూ.6 చెల్లించాలి. ప్రస్తుతం ఇంటర్‌ఛేంజ్ ఫీజు ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్‌కు రూ.15, నాన్ ఫైనన్షియల్ ట్రాన్సాక్షన్‌కు రూ.5 ఉన్న సంగతి తెలిసిందే. ఏటీఎం లావాదేవీల‌పై 2012 నుంచి ఇంజ్‌చేంజ్ ఫీజుల‌ను బ్యాంకులు వ‌సూలు చేస్తున్నాయి. ఒక బ్యాంకుకు చెందిన ఖాతాదారుడు మ‌రో బ్యాంకు ఏటీఎం నుంచి న‌గ‌దు తీసుకున్న‌ప్పుడు ఈ చార్జీలు వ‌ర్తిస్తాయి.

సాల‌రీ, పెన్ష‌న్‌, ఈఎంఐ

సాధార‌ణంగా ప్రతీ నెల ఒకటో తేదీన జీతం అకౌంట్‌లో ప‌డుతుంది. అయితే.. 1వ తేదీ సెల‌వు రోజు అయితే.. వేత‌నం రావ‌డం ఒక‌టి లేదా రెండు రోజులు ఆల‌స్యం అవుతుంది. కానీ ఇకపై ఇలాంటి సమస్యే ఉండదు. సెలవు రోజుల్లో కూడా ఖాతాదారుల అకౌంట్లలో వేతనాలు, పెన్షన్లు జమ చేసేలే నేషనల్ ఆటోమెటెడ్ క్లియరెన్స్ హౌజ్(నాచ్‌) మార్పులు చేసింది. 2021 ఆగస్ట్ 1 నుంచి ఈ రూల్స్ అమల్లోకి రానున్నాయి. ఆగస్ట్ 1 ఆదివారం రోజు కూడా వేతనాలు, పెన్షన్లు, డివిడెండ్, వడ్డీ క్రెడిట్ అవుతాయి. అంతేకాదు.. మీరు చెల్లించాల్సిన ఈఎంఐ, మ్యూచువల్ ఫండ్ సిప్, లోన్ పేమెంట్ లాంటి వాటికీ ఈ రూల్ వర్తిస్తుంది. అంటే సెలవు రోజుల్లో కూడా పేమెంట్స్ జరిగిపోతాయి.

ప‌లు చార్జీల‌ను స‌వ‌రించిన ఐసీఐసీఐ బ్యాంకు

ఐసీఐసీఐ బ్యాంక్ పలు ఛార్జీలను సవరించింది. క్యాష్ ట్రాన్సాక్షన్స్‌పై లిమిట్, ఏటీఎం ఇంటర్‌ఛేంజ్, చెక్ బుక్ లాంటి అంశాల్లో ఆగస్ట్ 1 నుంచి కొత్త ఛార్జీలు అమల్లోకి వస్తున్నాయి. న‌గ‌దు జ‌మ‌, వెన‌క్కి తీసుకునేందుకు మొత్తం నాలుగు ఉచిత లావాదేవీల‌నే అనుమ‌తించ‌నుంది. ఆ త‌రువాత నుంచి ప్ర‌తి లావాదేవీకి రూ.150 ఛార్జీ చేయ‌నుంది. మూడో వ్య‌క్తులు చేసే న‌గ‌దు జ‌మ‌ల‌పైనా ప‌రిమితులు విధించింది. రూ.25,000 వ‌ర‌కు రూ.150 రుసుము వ‌సూలు చేయ‌నుంది. ఆపై జ‌మ‌ను అనుమ‌తించ‌దు. ఏడాదికి 25 చెక్కులు ఉచితంగా ఇస్తుంది. ఆ త‌రువాత 10 చెక్కులుండే ఒక్కో చెక్‌బుక్కు రూ.20 చెల్లించాలి.

ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్‌

ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్(ఐపీపీబీ) కస్టమర్లు డోర్‌స్టెప్ సర్వీసులకు ఇక అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. ఇంటి వ‌ద్ద‌కు సేవ‌లు కోరుకునే ప్ర‌తి ఖాతాదారులు ప్ర‌తి సర్వీసుకు రూ.20 ఫ్ల‌స్ జీఎస్‌టీ చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటివరకైతే ఐపీపీబీ డోర్‌స్టెప్ సేవలకు ఛార్జీలు లేవు.

Next Story