పెరిగిన జీఎస్‌టీ రేట్లు అమలు.. పలు వస్తువులు, సేవ‌ల ధ‌ర‌ల‌కు రెక్క‌లు!

New GST rates on number of items come into effect from today. పెరిగిన జీఎస్‌టీ రేట్లు నేటి ఉద‌యం నుంచి అమ‌ల్లోకి వ‌చ్చాయి. నూత‌న జీఎస్‌టీ రేట్లు అమ‌ల్లోకి రావ‌డంతో ప‌లు ఆహారోత్ప‌త్తులు,

By అంజి  Published on  18 July 2022 10:13 AM GMT
పెరిగిన జీఎస్‌టీ రేట్లు అమలు.. పలు వస్తువులు, సేవ‌ల ధ‌ర‌ల‌కు రెక్క‌లు!

పెరిగిన జీఎస్‌టీ రేట్లు నేటి ఉద‌యం నుంచి అమ‌ల్లోకి వ‌చ్చాయి. నూత‌న జీఎస్‌టీ రేట్లు అమ‌ల్లోకి రావ‌డంతో ప‌లు ఆహారోత్ప‌త్తులు, వ‌స్తువులు, సేవ‌ల ధ‌ర‌లు భార‌ంగా మారాయి. దీంతో ప్రీ ప్యాక్డ్, ప్యాకేజ్‌డ్ ఆహర ఉత్ప‌త్తుల‌పై క‌స్ట‌మ‌ర్లు అధిక మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. నిర్ధిష్ట వ‌స్తువులు, ఉత్ప‌త్తుల‌పై జీఎస్‌టీ రేట్లు పెర‌గ‌డంతో నిత్యావ‌స‌రాల ధ‌ర‌లూ భ‌గ్గుమంటున్నాయి. హోట‌ల్ రూంలు, బ్యాంక్ సేవ‌లు ఛార్జీలు పెరిగాయి. ఇక ఎల‌క్ట్రానిక్ వాహ‌నాల‌పై జీఎస్‌టీ రేటు 5 శాతం త‌గ్గ‌డం ఒక్క‌టే కొంత ఊర‌ట క‌లిగిస్తోంది. ఆర్ధిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ అధ్య‌క్ష‌త‌న‌ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్ర‌తినిధుల‌తో కూడిన జీఎస్‌టీ కౌన్సిల్‌లో నిర్ణ‌యాల‌కు అనుగుణంగా తాజా జీఎస్‌టీ రేట్లు నేటి నుంచి అమ‌ల్లోకి వ‌చ్చాయి.

గత నెలలో చండీగఢ్‌లో జరిగిన 47వ జీఎస్‌టీ కౌన్సిల్‌ సమావేశంలో జీఎస్‌టీ రేట్ల మార్పుపై నిర్ణయం తీసుకున్నారు.

  • ధరలు పెరిగేవి..

ప్యాక్ చేసి విక్రయించే ఆహార ఉత్పత్తులు (మనం కొనుగోలు చేసే తినుబండారాలు, అప్పడాలు, మురుకులు, జంతికలు, మిక్చర్ తదితర), ప్యాక్ చేసి విక్రయించే ఆటా పిండి (బ్రాండెడ్ కాకపోయినా సరే, షాపుల్లో లోకల్‌గా ప్యాక్ చేసి విక్రయించేవి), పెరుగు, ఆసుపత్రుల్లో రూ.5,000కు మించిన రూమ్ రెంట్ పై కొత్తగా 5 శాతం జీఎస్టీ వేశారు. ఇప్పటి వరకు వీటిపై జీఎస్టీ లేదు.

టెట్రా ప్యాక్‌లపై, బ్యాంకులు చెక్కుల జారీ కోసం వసూలు చేసే చార్జీపై 18 శాతం జీఎస్టీ పడుతుంది.

మ్యాప్‌లు, చార్ట్‌లు, అట్లాస్‌లపైనా 12 శాతం జీఎస్టీ పడుతుంది.

ప్రింటింగ్, రైటింగ్, డ్రాయింగ్ ఇంక్.. చాకులు, పేపర్లను కత్తిరించే చాకులు, పెన్సిల్ షార్ప్ నర్లు, ఎల్ఈడీ ల్యాంపులపై 12 శాతంగా ఉన్న జీఎస్టీ 18 శాతానికి పెరిగింది.

సోలార్ వాటర్ హీటర్లపై ఇప్పటి వరకు 5 శాతం జీఎస్టీ ఉంటే, 12 శాతానికి పెంచారు.

రహదారులు, వంతెనలు, రైల్వేలు, మెట్రోలు, అఫ్లూయంట్ ట్రీట్ మెంట్ ప్లాంట్లకు సంబంధించి కాంట్రాక్టు పనులు, శ్మశాన వాటికల సేవలపై 12 శాతం జీఎస్టీని 18 శాతానికి పెంచారు.

  • ధరలు తగ్గేవి..

రోప్ వేల ద్వారా వస్తువుల రవాణా, ప్రయాణికుల రవాణా సేవలపై 12 శాతం జీఎస్టీ రేటును 5 శాతానికి తగ్గించారు.

వాయు మార్గంలో ఈశాన్య రాష్ట్రాల నుంచి, ఈశాన్య రాష్ట్రాలకు, బాగ్రోడియాకు తీసుకెళ్లే ప్రయాణికుల సేవలపై జీఎస్టీ మినహాయించారు.

ట్రక్కులు, గూడ్స్ క్యారియర్ల అద్దెలపై సర్వీస్ చార్జీని 18 శాతం నుంచి 12 శాతానికి తగ్గించారు.

ఎలక్ట్రిక్ వాహనాలు 5 శాతం రాయితీ జీఎస్టీ రేటుకు లభిస్తాయి.

Next Story