భారీ షాక్.. నేచురల్ గ్యాస్ ధర 40శాతం పెంపు
Natural gas prices hiked by 40% to record levels. సహాజవాయువు ధరలను కేంద్ర ప్రభుత్వం 40 శాతం మేర పెంచింది.
By తోట వంశీ కుమార్ Published on 1 Oct 2022 8:59 AM ISTమూలిగే నక్కపై తాటి పండు పడ్డట్లు అన్న చందంగా తయారైంది సామాన్యుడి పరిస్థితి. ఓ వైపు నిత్యావసర ధరలు పెరుగుతుండగా.. మరోవైపు గ్యాస్ ధరలకు రెక్కలొచ్చాయి. విద్యుత్ ఉత్పత్తికి, ఎరువుల తయారీకి ఉపయోగించే సహాజవాయువు (నేచురల్ గ్యాస్) ధరలను కేంద్ర ప్రభుత్వం 40 శాతం మేర పెంచింది. నేటి నుంచి వచ్చే ఆరు నెలల పాటు ఈ ధరలు అమల్లోకి ఉంటాయని మంత్రిత్వ శాఖకు చెందిన పెట్రోలియం ప్లానింగ్ అండ్ అనాలసిస్ సెల్ (పీపీఏసీ) తెలిపింది. అంతర్జాతీయ రేట్లకు అనుగుణంగా ఈ పెంపు నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.
ఫలితంగా వాహనాల్లో ఉపయోగించే సీఎన్‌జీ, వంట అవసరాల కోసం పైపుల ద్వారా ఇళ్లకు సరఫరా చేసే పీఎన్‌జీ రేట్లకు రెక్కలు రానున్నాయి. ఈ ధరల పెంపు సామాన్యుడిపై తీవ్ర ప్రభావం చూపనుంది. గ్యాస్‌ను ఉపయోగించి ఉత్పత్తి చేసే ఎరువులు, విద్యుత్ తయారీ వ్యయాల భారం కూడా పెరగనున్నాయి. సాధారణంగా గ్యాస్ రేట్లను ప్రభుత్వం ప్రతీ ఆరు నెలలకోసారి సమీక్షిస్తుంటుంది.
తాజా పెంపుతో యూనిట్(ఎంబీటీయూ) రేటు రికార్డు స్థాయిలో 6.1డాలర్లు నుంచి 8.57 డాలర్లకు చేరింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి సంస్థలు సంక్లిష్టమైన క్షేత్రాల నుంచి ఉత్పత్తి చేసే గ్యాస్ రేటు 9.92 డాలర్ల నుంచి 12.6 డాలర్లకు పెరిగింది.
ఇదిలా ఉంటే.. ఇంధన పెరుగుదల వల్ల ద్రవ్యోల్బణం ఏర్పడే అవకాశం ఉండడంతో గత 8 నెలల నుంచి ధరల నియంత్రణపై ఆర్బీఐ మరింత దృష్టి పెట్టింది. ధరల నిర్ణయించడానికి ప్రభుత్వం ఒక కమిటీని వేసింది. మాజీ ప్లానింగ్ కమిషన్ మెంబర్ కిరిట్ ఎస్ పరీఖ్ సారథ్యంలో ఈ కమిటీ సెప్టెంబర్ చివరి నాటికి నివేదిక ఇవ్వాల్సి ఉండగా.. మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉంది.