భారతదేశపు అగ్రశ్రేణి కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ పలు కార్లను రీకాల్ చేసింది. ఎయిర్‌బ్యాగ్ కంట్రోలర్‌లలో లోపం కారణంగా డిసెంబర్ 8, 2022- జనవరి 12, 2023 మధ్య తయారు చేసిన 17,362 వాహనాలను రీకాల్ చేస్తున్నట్లు తెలిపింది. ఎయిర్‌బ్యాగ్ కంట్రోలర్‌లోని ప్రభావిత భాగాన్ని తనిఖీ చేస్తున్నట్లు తెలుస్తోంది.
2022 డిసెంబర్ 8 నుంచి 2023 జనవరి 12 మధ్య తయారైన మారుతీ సుజుకీ వాహనాలను వెనక్కి తీసుకుంటున్నట్లు ఒక ప్రకటనలో తెలిపిందీ ప్రముఖ కార్ల తయారీ సంస్థ. ఆల్టో K10 (Alto K10), ఎస్- ప్రెస్సో (S-Presso), ఎకో (Echo), బ్రెజ్జా (Brezza), బాలెనో (Balano), గ్రాండ్ విటారా (Grand Vitara) వంటి మోడళ్లు ఈ కార్ల జాబితాలో ఉన్నాయి.
రీకాల్ చేసిన కార్లలో ఎయిర్‌బ్యాగ్ కంట్రోలర్‌ను తనిఖీ చేసి, అవసరమైతే రీప్లేస్ చేస్తామని మారుతీ సుజుకీ వెల్లడించింది. అయితే అవసరమైన వాహనాల్లో ఇది ఉచితంగానే చేస్తామని, ఎలాంటి ఫీజు వసూలు చేయబోమని స్పష్టం చేసింది. ఎయిర్‌బ్యాగ్స్‌లో చిన్న లోపం ఉన్నట్లు తాము భావిస్తున్నామని మారుతీ సుజుకీ వివరించింది. ఒకవేళ ఆ లోపం ఉంటే వాహనాలు ప్రమాదాలకు గురైన సమయంలో ఎయిర్‌బ్యాగ్స్, సీట్ బెల్ట్ అమరిక కుదరకపోవచ్చని చెప్పింది.