శుభవార్త.. భారీగా తగ్గిన ఎల్పీజీ సిలిండర్ ధర
LPG price new rates released on 1st September.ఎల్‌పీజీ గ్యాస్ వినియోగదారులకు అదిరిపోయే శుభవార్త వచ్చింది.
By తోట వంశీ కుమార్ Published on 1 Sep 2022 2:33 AM GMT
ఎల్పీజీ గ్యాస్ వినియోగదారులకు సెప్టెంబరు నెల మొదటి రోజు అదిరిపోయే శుభవార్త వచ్చింది. ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరలను భారీగా తగ్గించాయి చమురు మార్కెటింగ్ కంపెనీలు. ఈ మేరకు సెప్టెంబర్ 1న సవరించిన ధరల వివరాలను వెల్లడించాయి. డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పు లేకపోయినప్పటికీ.. వాణిజ్య గ్యాస్ సిలిండర్ల ధరలను భారీగా తగ్గించింది ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్. వాణిజ్య గ్యాస్ సిలిండర్లపై రూ.100 వరకు తగ్గించింది. ఢిల్లీలో రూ.91.50, కోల్‌కతాలో రూ.100, ముంబైలో రూ.92.50, చెన్నైలో రూ.96 తగ్గించినట్లు ప్రకటించింది. తగ్గిన ధరలు నేటి నుంచే అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది.
దేశ రాజధాని ఢిల్లీలో వాణిజ్య సిలిండర్ కు గతంలో రూ.1976.50 ఉండగా తాజా తగ్గింపుతో రూ.1885 చేరింది. అదే విధంగా కోల్‌కతాలో రూ.2095.50 నుంచి రూ.1995.50కి, ముంబైలో రూ.1936.50కి నుంచి రూ.1844, చెన్నైలో రూ.2141కి బదులుగా రూ.2045 దిగొచ్చింది. హైదరాబాద్‌లో 19 కేజీల కమర్షియల్ సిలిండర్ రూ.2099.5కి, వరంగల్‌లో రూ.2141.50, విజయవాడలో రూ.2034, విశాఖపట్టణంలో రూ.1953కి చేరింది.
ఇకపోతే.. 14.2 కేజీల గృహ వినియోగ సిలిండర్ల విషయంలో మాత్రం ఎలాంటి మార్పు లేదు. డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండర్ ధరలు స్థిరంగా ఉన్నాయి. చివరిసారిగా.. జూలై 6న మాత్రమే రూ.50 పెరిగింది. ఆ తర్వాత నుంచి పెరగలేదు. హైదరాబాద్‌లో 14.2 కేజీల గృహ వినియోగ సిలిండర్ ధర రూ.1105 వద్ద స్థిరంగా ఉంది. వరంగల్‌లో రూ.1124గా ఉంది.