పండుగకు ముందే సామ్యానుడికి షాక్.. వచ్చేవారం సిలిండర్‌పై రూ.100 పెంపు..!
LPG price may be hiked next week.ఇప్పటికే పెరుగుతున్న ఇంధన ధరలతో అల్లాడిపోతున్న సామాన్యుడికి మరో షాక్ తగలనుంది
By తోట వంశీ కుమార్ Published on 28 Oct 2021 4:02 AM GMTఇప్పటికే పెరుగుతున్న ఇంధన ధరలతో అల్లాడిపోతున్న సామాన్యుడికి మరో షాక్ తగలనుంది. దీపావళి పండుగకు ముందే గ్యాస్ సిలిండర్ ధరలు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. అంతర్జాతీయంగా మార్కెట్‌లో ధరలు పెరగడంతో సిలిండర్‌పై రూ.100 వరకు పెరగనున్నట్లు తెలుస్తోంది. అంతర్జాతీయంగా ఎల్పీజీ ధరలు 60 శాతం పెరగడంతో.. దేశీయంగా గ్యాస్ సిలిండర్ పై రూ.100 మేర నష్టం వస్తోందని.. దాన్ని భర్తీ చేసుకోవడానికి రేటు పెంచక తప్పదని చమురు కంపెనీలు చెబుతున్నాయి. అయితే.. ఇందుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వాల్సి ఉంది. వారం రోజుల్లో ప్రభుత్వం నుంచి అనుమతి రానునందని.. ఆ వెంటనే ధరలు పెంచనున్నట్లు చమురు కంపెనీలు చెబుతున్నాయి.
సాధారణంగా వంట గ్యాస్ నియంత్రణ సరకుగానే పరిగణిస్తారు. దీంతో వీటి ధర ఎంత ఉండాలన్నది ప్రభుత్వమే నిర్ణయిస్తుంది. వినియోగదారులపై అధిక భారం పడకుండా ఉండేందుకు ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది. ఆ మొత్తాన్ని ప్రభుత్వమే ఆయా కంపెనీలకు చెల్లిస్తుంది. ఒకవేళ ప్రభుత్వం ఒప్పుకుంటే ఈ ఏడాది వంట గ్యాస్ సిలిండర్ ధర పెరగడం ఇది ఐదోసారి అవుతుంది. ఈ నెల 6వ తేదీనే సిలిండర్‌పై రూ.15 మేర పెరిగిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం 14.2 కిలోల సబ్బిడీ వంట గ్యాస్ సిలిండర్ ధర ఢిల్లీలో రూ.899.50, ముంబైలో రూ.899.50, కోల్‌కతాలో రూ.926, హైదరాబాద్‌లో రూ.952గా ఉంది.
రేషన్ దుకాణాల ద్వారా చిన్న సిలిండర్లు..
ఇక రేషన్ షాపుల ద్వారా చిన్న గ్యాస్ సిలిండర్లను పంపిణీ సరఫరా చేయించాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. కేంద్ర ఆహార శాఖ కార్యదర్శి సుధాంశు పాండే.. చమురు కంపెనీల ప్రతినిధులు, ఐటీ,ఆర్థిక, పెట్రోలియం శాఖల అధికారులతో జరిపిన సమావేశంలో ఈ మేరకు చర్చలు జరిపారు. ఈ విషయమై డీలర్లకు అవగాహన కల్పించాలని రాష్టాలకు కేంద్రం సూచించింది.