మ‌ళ్లీ పెరిగిన గ్యాస్ సిలిండ‌ర్ ధ‌ర‌

LPG price hiked for second time this month.గ్యాస్ ధ‌ర మ‌ళ్లీ పెరిగింది. ఇప్ప‌టికే భారంగా మారిన గృహ (డొమెస్టిక్‌)

By తోట‌ వంశీ కుమార్‌  Published on  19 May 2022 3:31 AM GMT
మ‌ళ్లీ పెరిగిన గ్యాస్ సిలిండ‌ర్ ధ‌ర‌

గ్యాస్ ధ‌ర మ‌ళ్లీ పెరిగింది. ఇప్ప‌టికే భారంగా మారిన గృహ (డొమెస్టిక్‌) సిలిండర్‌ను మ‌ళ్లీ పెంచేశాయి ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు. అలాగే కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధ‌ర‌ను కూడా పెంచాయి. అసలే పెరిగిన పెట్రోలు,డీజిల్‌ ధరలతో సతమతమవుతున్న జనానికి గ్యాస్‌ ధర శరాఘాతంలా మారనుంది. తరచూ ధరల పెంపుతో మధ్యతరగతి కుటుంబాల బడ్జెట్‌ తలకిందులయ్యే పరిస్థితి దాపురించింది.

14 కేజీల డొమెస్టిక్ ఎల్‌పీజీ సిలిండర్ ధర రూ. 3.50పైస‌లు మేర పెరిగింది. అలాగే వాణిజ్య సిలిండ‌ర్ ధ‌ర ను రూ.8పెంచుతూ చ‌మురు సంస్థ‌లు నిర్ణ‌యం తీసుకున్నాయి. పెంచిన ధ‌ర‌లు త‌క్ష‌ణ‌మే అమ‌ల్లోకి వ‌స్తాయ‌ని తెలిపాయి. తాజా పెంపుతో ఢిల్లీలో 14.2 కేజీల సిలిండర్ రూ. 1003కు చేర‌గా.. ముంబైలో రూ. 1002.50, కోల్‌కతాలో రూ. 1029, చెన్నైలో రూ. 1018.5 కి చేరింది.

ఎల్‌పీజీ సిలిండర్ ధర పెరగడం ఈ నెలలో ఇది రెండో సారి కావడం గమనార్హం. మే 7న సిలిండర్ ధర రూ. 50 మేర పెంచిన సంగ‌తి తెలిసిందే. దేశంలో ఇప్పుడు ఎక్కడ చూసిన 14 కేజీల సిలిండర్ ధర రూ. 1000కి పైనే ఉంది. తెలుగు రాష్ట్రాల్లో సిలిండర్ కొనాలంటే రూ. 1050కు పైగా చెల్లించుకోవాల్సిన పరిస్థితులు నెల‌కొన్నాయి.

ఇక వాణిజ్య సిలిండ‌ర్ రేటు రూ.8 పెర‌గ‌డంతో ఢిల్లీలో రూ. 2354, కోల్‌కతాలో రూ. 2454గా, ముంబైలో రూ. 2306గా, ముంబైలో రూ. 2507కి చేరింది.

Next Story