అదానీ కంపెనీల్లో ఎల్‌ఐసీ పెట్టుబడులపై దుమారం

సంక్షోభంలో చిక్కుకున్న అదానీ సంస్థలను కాపాడేందుకు ప్రభుత్వం ఎల్‌ఐసీతో రూ.33 వేల కోట్ల పెట్టుబడులు పెట్టించిందన్న వాషింగ్టన్‌ పోస్ట్‌ కథనం దుమారం రేపుతోంది.

By -  అంజి
Published on : 26 Oct 2025 9:39 AM IST

LIC, Washington Post, Adani investment plan, Business News

అదానీ కంపెనీల్లో ఎల్‌ఐసీ పెట్టుబడులపై దుమారం

సంక్షోభంలో చిక్కుకున్న అదానీ సంస్థలను కాపాడేందుకు ప్రభుత్వం ఎల్‌ఐసీతో రూ.33 వేల కోట్ల పెట్టుబడులు పెట్టించిందన్న వాషింగ్టన్‌ పోస్ట్‌ కథనం దుమారం రేపుతోంది. ఇవి తప్పుడు ఆరోపణలని, తాము స్వతంత్రంగానే పెట్టుబడి పెట్టామని ఎల్‌ఐసీ స్పష్టం చేసింది. మరోవైపు 30 కోట్ల ఎల్‌ఐసీ వాటాదారులు కష్టార్జితాన్ని మోదీ దుబారా చేస్తున్నారని కాంగ్రెస్‌ మండిపడింది. పార్లమెంటరీ పబ్లిక్‌ అకౌంట్స్‌ కమిటీతో దర్యాప్తు జరపాలని డిమాండ్ చేసింది.

రూ.41 లక్షల కోట్ల ఆస్తులున్న ఎల్‌ఐసీ దేశంలోని టాప్‌ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టింది. వీటి విలువ రూ.2014లో రూ.1.56 లక్షల కోట్లు కాగా.. ఇప్పుడు 10 రెట్లు పెరిగి రూ.15.6 లక్షల కోట్లకు చేరాయి. ప్రస్తుతం పలు కంపెనీల్లో వాటాలు ఇలా.. టీసీఎస్‌ - 5.02 శాతం (5.7 లక్షల కోట్లు), రిలయన్స్‌ - 6.94 శాతం (1.33 లక్షల కోట్లు), ఐటీసీ - 15.86 శాతం (రూ.82 వేల కోట్లు), ఎస్‌బీఐ - 9.59 శాతం (రూ.79,361 కోట్లు), హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ - 4.89 శాతం (రూ.64,725 కోట్లు), అదనీ గ్రూప్‌ - 4 శాతం (రూ.60 వేల కోట్లు)

ప్రభుత్వ యాజమాన్యంలోని బీమా దిగ్గజం నుండి అదానీ గ్రూప్ కంపెనీలకు $3.9 బిలియన్ల (రూ.33,000 కోట్లు) పెట్టుబడులను మళ్లించడానికి ప్రభుత్వ అధికారులు మే నెలలో ఒక ప్రణాళికను రూపొందించారని ఆరోపిస్తూ ది వాషింగ్టన్ పోస్ట్‌లో ప్రచురితమైన నివేదికను లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) శనివారం తోసిపుచ్చింది. బాహ్య కారకాల ప్రభావం వల్ల తమ పెట్టుబడి నిర్ణయాలు ప్రభావితమయ్యాయనే వాదనలు "తప్పుడువి, నిరాధారమైనవి, సత్యానికి దూరంగా ఉన్నాయి" అని LIC ఒక ప్రకటనలో పేర్కొంది. అటువంటి ప్రతిపాదన లేదా పత్రాన్ని బీమా సంస్థ ఎప్పుడూ తయారు చేయలేదని LIC తెలిపింది.

"బోర్డు ఆమోదించిన విధానాల ప్రకారం పెట్టుబడి నిర్ణయాలను LIC స్వతంత్రంగా తీసుకుంటుంది. ఆర్థిక సేవల విభాగం (ఆర్థిక మంత్రిత్వ శాఖలో) లేదా మరే ఇతర సంస్థకు అటువంటి (పెట్టుబడి) నిర్ణయాలలో ఎటువంటి పాత్ర లేదు" అని ప్రకటనలో పేర్కొంది.

Next Story