ట్విట్టర్‌కు ప్రత్యామ్నాయం ఎదగడానికి 'కూ' ప్రయత్నాలు
Koo set to explore Nigeria's social media space.దేశంలో సోషల్ మీడియా నిబంధనలు కఠినతరం చేసిన
By తోట వంశీ కుమార్ Published on 6 Jun 2021 3:49 PM IST
దేశంలో సోషల్ మీడియా నిబంధనలు కఠినతరం చేసిన సంగతి తెలిసిందే. దీంతో ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్ మెడపై కత్తి వేలాడుతుంది. కేంద్రం చెప్పిన నిబంధనలను అమలు చేయడానికి ట్విట్టర్ ఇంకా సంసిద్దతను వ్యక్తం చేయలేదు. దీంతో ట్విట్టర్ కు కేంద్రం చివరి అవకాశం ఇచ్చింది. అటు నైజీరియా కూడా ట్విట్టర్‌పై నిషేదం విదించింది. ఆదేశ అధ్యక్షుడి ట్వీట్‌ను డిలీట్ చేయడంతో పాటు ఆయన అకౌంట్‌ను 12 గంటల పాటు సస్పెండ్ చేయడంతో ట్విట్టర్ పై ఆ దేశం నిషేదం విధించింది.
ఇదే అదునుగా బావిస్తున్న భారత సోషల్ నెట్వర్కింగ్ సైట్ 'కూ' ట్విట్టర్‌కు ప్రత్యామ్నాయంగా నిలిచేందుకు తీవ్రంగా కృషి చేస్తోంది. తాము ఇప్పుడు నైజీరియాలో అందుబాటులో ఉన్నామని ప్రకటించింది. నైజీరియాలో తమ రంగప్రవేశంపై 'కూ' వ్యవస్థాపకులు, సీఈఓ అప్రమేయ రాధాకృష్ణ స్పష్టత ఇచ్చారు. నైజీరియాలో ఇతర మైక్రోబ్లాగింగ్ సైట్లకు ఓ అవకాశం వచ్చిందని, దాన్ని సద్వినియోగం చేసుకుంటామన్నారు. 'కూ' లో నైజీరియా స్థానిక భాషలకు కూడా స్థానం కల్పిస్తామని తెలిపారు.
ట్విట్టర్ తరహాలోనే భావవ్యక్తీకరణకు ప్రాధాన్యత ఇచ్చే సామాజిక మాధ్యమంగా 'కూ' గతేడాది ప్రారంభమైంది. అప్రమేయ రాధాకృష్ణ, మయాంక్ బిదావట్కా కలిసి 'కూ'ని స్థాపించారు. తెలుగు, బెంగాలీ, హిందీ వంటి అనేక భాషల్లో అందుబాటులో ఉంది. 'కూ'కి ఇప్పటివరకు 60 లక్షల మంది యూజర్లు ఉన్నారు.