భారతదేశపు అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగోలో కీలక నాయకత్వ మార్పులు చోటుచేసుకున్నాయి. గత మూడు నెలలుగా ఎదుర్కొంటున్న కార్యాచరణ అంతరాయాల నేపథ్యంలో, సీఈఓ పీటర్ ఎల్బర్స్ తన పదవి నుంచి తప్పుకుంటున్నట్లు మంగళవారం ప్రకటించారు. ఈ క్రమంలో కొత్త సీఈఓను నియమించే వరకు కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ రాహుల్ భాటియా తాత్కాలికంగా నిర్వహణ బాధ్యతలను చేపట్టనున్నారు.
ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ చైర్మన్ విక్రమ్ సింగ్ మెహతా ఈ విషయాన్ని ధృవీకరిస్తూ, కంపెనీ సంస్కృతిని బలోపేతం చేయడానికి మరియు వినియోగదారులకు మరింత మెరుగైన, వృత్తిపరమైన సేవలను అందించడానికే రాహుల్ భాటియా తిరిగి బాధ్యతలు తీసుకుంటున్నారని తెలిపారు. ఇండిగో బ్రాండ్ పేరుతో విమానయాన సేవలను నిర్వహిస్తున్న ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్, త్వరలోనే కొత్త నాయకుడిని ప్రకటించే అవకాశం ఉంది.