ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎల్ఐసీ) ఐపీఓ షేర్లు నేడు(మంగళవారం) మార్కెట్లలో లిస్టయ్యాయి. బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ (బీఎస్ఈ), నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్(ఎన్ఎస్ఈ)లో ఇవాళ ఎల్ఐసీ ట్రేడింగ్ జరుగుతోంది. కాగా.. ఐపీవోలో భాగంగా ఒక్కో షేరును రూ.949 ధర నిర్ణయించారు. ఈ ధరతో పోలిస్తే 8 శాతం తక్కువగా అంటే రూ.872 వద్ద లిస్టయ్యింది. షేరు క్రమంగా రికవరీ అవుతోంది. కొనుగోళ్ల మద్దతుతో ప్రస్తుతం రూ.912 వద్ద బీఎస్ఈలో ట్రేడ్ అవుతోంది. లిస్టింగ్ కన్నా ఇది 5 శాతం ఎక్కువ.
ఎల్ఐసీ ఐపీవోకు దాదాపు మూడు రెట్ల స్పందన లభించిన సంగతి తెలిసిందే. పాలసీదారుల కోటాలో దరఖాస్తు చేసుకున్న వారికి ఒక్కో షేరుపై రూ.60 తగ్గింపు నివ్వగా.. ఈ విభాగంలో 6 రెట్ల షేర్లకు బిడ్లు దాఖలు అయ్యాయి. పాలసీదారులకు ఒక్కో షేరు రూ.889కే లభించింది. రిటైల్ ఇన్వెస్టర్లకు ఒక్కో షేరుపై రూ.45 తగ్గింపు ఇచ్చారు. అంటే వారికి ఒక్కో షేరు రూ.904కు వచ్చింది. ఐపీవోలో భాగంగా ఎల్ఐసీలో కేంద్ర ప్రభుత్వం తన వాటాల నుంచి 3.5 శాతం మేర విక్రయించి రూ.20,557 కోట్లను సమీకరించింది.