ఇండియన్ ఆయిల్ కీలక నిర్ణయం.. తెలంగాణలో 264 ఛార్జింగ్ స్టేషన్లు
Indian Oil will set up 264 charging points in Telangana. ఇండియన్ ఆయిల్ కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో హైదరాబాద్‌తో పాటు ఇతర జిల్లాల్లో
By అంజి Published on 29 Dec 2022 11:38 AM GMTఇండియన్ ఆయిల్ కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో హైదరాబాద్‌తో పాటు ఇతర జిల్లాల్లో 264 ఛార్జింగ్ స్టేషన్లు, 25 బ్యాటరీ-స్వాపింగ్ సౌకర్యాలను ఇండియన్ ఆయిల్ ఏర్పాటు చేయనుంది. దీంతో తమ వ్యాపారాన్ని ఇండియన్ ఆయిల్ మరింత విస్తరించుకోనుంది. తెలంగాణలో ఏడు కంప్రెస్డ్ బయోగ్యాస్ (సీబీజీ) ఉత్పత్తి ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నట్లు ఇండియన్ ఆయిల్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హెడ్ బి అనిల్ కుమార్ తెలిపారు. ఈ ఏడు ప్లాంట్లలో హైదరాబాద్‌లో మూడు, జనగాం, మహబూబ్‌నగర్, మేడ్చల్, వరంగల్‌లో ఒక్కొక్కటి చొప్పున ఏర్పాటు చేస్తారు.
దీర్ఘకాలిక ఒప్పందం ద్వారా ఈ ప్లాంట్ల నుంచి కొనుగోలు చేసిన సీబీజీని ఇండియన్ ఆయిల్ రిటైల్ అవుట్‌లెట్‌ల ద్వారా 'ఇండిగ్రీన్' బ్రాండ్‌తో విక్రయించనున్నట్లు అనిల్ కుమార్ తెలిపారు. ఇండియన్ ఆయిల్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో 10 శాతం ఇథనాల్‌ను పెట్రోల్‌తో కలపడాన్ని సాధించింది. గత మూడేళ్లలో తెలంగాణలో 337 రిటైల్ అవుట్‌లెట్‌లను విజయవంతంగా ప్రారంభించింది. ఈ ఏడాది 94 బ్యాటరీ ఛార్జింగ్ స్టేషన్లను ప్రారంభించామని, మరో 264 ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసే అవకాశం ఉందన్నారు.
ఇండియన్ ఆయిల్ తెలంగాణ వ్యాప్తంగా ఉన్న తన రిటైల్ అవుట్‌లెట్లలో 25 బ్యాటరీ-స్వాపింగ్ సౌకర్యాలను ఏర్పాటు చేయడానికి మరిన్ని ప్రణాళికలు రచిస్తున్నట్లు అనిల్ కుమార్ తెలిపారు. ప్రస్తుతం.. కంపెనీ తెలంగాణలోని 46 రిటైల్ అవుట్‌లెట్లలో CNG (కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్)ని మార్కెట్ చేస్తోంది. 2023లో మరో 21 CNG ఫిల్లింగ్ సౌకర్యాలను జోడించాలని యోచిస్తోంది. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా ఇండియన్ ఆయిల్ 20 శాతం ఇథనాల్ కలిపిన పెట్రోలు కోసం కృషి చేస్తోంది.
తెలంగాణలో ఇండియన్ ఆయిల్‌కు పెట్రోల్‌లో 34.6 శాతం, డీజిల్‌లో 38 శాతం, దేశీయ ఎల్‌పిజి వ్యాపారంలో 40 శాతం మార్కెట్ వాటా ఉందని అనిల్ కుమార్ చెప్పారు. సంస్థ రాష్ట్రంలో 11.86 వేల కిలోలీటర్ల మోటార్ స్పిరిట్, 42.56 వేల కిలోలీటర్ల హైస్పీడ్ డీజిల్ నిల్వ సామర్థ్యాన్ని కలిగి ఉంది.