క్రిప్టోకరెన్సీ పై కేంద్ర ప్రభుత్వం ఉక్కుపాదం..!

India is set to ban Bitcoin. కేంద్ర ప్ర‌భుత్వం భారత్ లో క్రిప్టోకరెన్సీ ని రద్దు చేయాలని అడుగులు వేస్తోంది.

By Medi Samrat  Published on  15 March 2021 7:27 AM GMT
India is set to ban Bitcoin

బిట్ కాయిన్.. ప్రపంచం మొత్తాన్ని షాక్ కు గురిచేసింది. భారతదేశంలో కూడా ఎంతో మంది బిట్ కాయిన్ లాంటి క్రిప్టోకరెన్సీలలో పెట్టుబడులు పెట్టారు. ఇప్పుడు అలాంటి వారికి పెద్ద షాక్ అని చెప్పొచ్చు. క్రిప్టోక‌రెన్సీకి అనుమ‌తి ఇచ్చేదే లేదని ప్రభుత్వం తేల్చేసింది. కేంద్ర ప్ర‌భుత్వం భారత్ లో క్రిప్టోకరెన్సీ ని రద్దు చేయాలని అడుగులు వేస్తోంది. అందుకు సంబంధించి కొత్త చ‌ట్టాన్ని తీసుకొచ్చే ఆలోచ‌న‌లో ఉంది. డిజిట‌ల్ క‌రెన్సీని నిషేధించ‌డ‌మే కాదు.. అవి క‌లిగి ఉన్నా, వాటితో ట్రేడింగ్ చేసినా భారీ జ‌రిమానాలు విధించనుంది ప్రభుత్వం. భారత్ లో మొత్తం 70 ల‌క్ష‌ల మంది ద‌గ్గ‌ర క్రిప్టోక‌రెన్సీ ఉన్న‌ట్లు భావిస్తున్నారు. వీళ్లు క‌నీసం 100 కోట్ల డాల‌ర్లు వీటిలో పెట్టుబ‌డి పెట్టిన‌ట్లు తెలుస్తోంది. బిట్‌కాయిన్ విలువ 60 వేల డాల‌ర్ల మార్క్‌ను దాటిన నేప‌థ్యంలో ప్ర‌భుత్వం ఈ నిర్ణ‌యం తీసుకోవ‌డం ఇన్వ‌స్ట‌ర్ల‌కు షాక్ ఇచ్చింది.

మ‌న దేశంలో బిట్‌కాయిన్‌, డోజ్‌కాయిన్‌, ఇత‌ర క్రిప్టోక‌రెన్సీలు క‌లిగి ఉన్న‌వారిపై ఈ చట్టం తీవ్ర ప్ర‌భావం చూప‌నుంది. క్రిప్టోక‌రెన్సీలు క‌లిగి ఉండ‌టం, వాటి జారీ, ట్రేడింగ్‌, బ‌దిలీల‌ను నేరంగా ప‌రిగ‌ణించాల‌ని కొత్త చ‌ట్టం ప్ర‌తిపాదించిన‌ట్లు ఓ సీనియ‌ర్ ప్ర‌భుత్వ అధికారి తెలిపారు. నిజానికి గ‌త కొన్ని నెల‌లుగా క్రిప్టోక‌రెన్సీల‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ప్ర‌భుత్వం భావిస్తున్నా.. ఈ మ‌ధ్య డిజిట‌ల్ క‌రెన్సీకి అనుకూలంగా వ‌చ్చిన కొన్ని వ్యాఖ్య‌లు ఇన్వెస్ట‌ర్ల‌లో ఆశ‌లు రేపాయి. కానీ ఈ కొత్త చ‌ట్టం మాత్రం వారిని ఆందోళ‌న‌కు గురి చేస్తోంది. ప్ర‌ధాన ఆర్థిక వ్య‌వ‌స్థ‌ల్లో క్రిప్టోక‌రెన్సీపై నిషేధం విధించిన తొలి దేశంగా ఇండియా నిలుస్తుంది. ఇప్ప‌టి వ‌రకూ చైనా దీని ట్రేడింగ్‌ను నిషేధించినా, ఆ క‌రెన్సీని క‌లిగి ఉండ‌టాన్ని మాత్రం నేరంగా ప‌రిగ‌ణించ‌లేదు. జ‌రిమానా విధించే ముందు ఇన్వెస్ట‌ర్లు త‌మ క్రిప్టో ఆస్తుల‌ను న‌గ‌దు రూపంలోకి మార్చుకోవ‌డానికి 6 నెల‌ల వ‌ర‌కూ స‌మ‌యం ఇవ్వ‌నున్న‌ట్లు ఆ అధికారి చెప్పారు.

క్రిప్టోక‌రెన్సీల‌ను మొత్తంగా నిషేధించే ఆలోచ‌న త‌మ‌కు లేద‌ని ఇండియా టుడే కాన్‌క్లేవ్‌లో మాట్లాడుతూ ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ చెప్పిన సంగతి తెలిసిందే. వీటి విష‌యంలో అన్ని ద్వారాలు మూసే ఉద్దేశం ప్ర‌భుత్వానికి లేద‌ని చెప్పారు. అధికారిక క్రిప్టోక‌రెన్సీపై తుది నిర్ణ‌యం ఆర్బీఐదేన‌ని ఆమె అన్నారు. క్రిప్టోకరెన్సీ నియంత్రణకు అవసరమైన మార్గదర్శకాలపై కేంద్ర ప్రభుత్వం ఆర్‌బీఐతో సంప్రదింపులు జరుపుతోందని కూడా అన్నారు. డిజిటల్‌ కరెన్సీపై సుప్రీంకోర్టు ఓ అభిప్రాయంతో ఉంది..ఆర్‌బీఐతో మేం చర్చలు జరుపుతున్నాం..క్రిప్టోకరెన్సీ నియంత్రణకు మార్గదర్శకాలపై కసరత్తు సాగిస్తున్నామని నిర్మలా సీతారామన్ కొద్దిరోజుల కిందట చెప్పారు.‌ ప్రైవేట్‌ క్రిప్టోకరెన్సీలను నిషేధించి ప్రభుత్వమే అధికారికంగా డిజిటల్‌ కరెన్సీని తీసుకువస్తుందని ఆర్బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ చేసిన వ్యాఖ్యలు కూడా సంచలనం అయ్యాయి.


Next Story