శుభ‌వార్త‌.. ఇక‌పై రూ.5లక్ష‌ల వ‌ర‌కు ట్రాన్స్ ఫర్

IMPS daily transaction limit increased to ₹5 lakhడిజిట‌ల్ చెల్లింపులు చేసే వారికి ఆర్‌బీఐ(రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా)

By తోట‌ వంశీ కుమార్‌  Published on  8 Oct 2021 9:30 AM GMT
శుభ‌వార్త‌.. ఇక‌పై రూ.5లక్ష‌ల వ‌ర‌కు ట్రాన్స్ ఫర్

డిజిట‌ల్ చెల్లింపులు చేసే వారికి ఆర్‌బీఐ(రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) తీపి క‌బురు అందించింది. డిజిట‌ల్ చెల్లింపులు ప్రోత్స‌హించేందుకు ఆన్‌లైన్‌లో న‌గ‌దు బ‌దిలీ సేవ‌ల‌కు ఉప‌యోగించే ఐఎంపీఎస్ ( ఇమ్మిడియేట్ పేమెంట్ స‌ర్వీస్) లావాదేవీల ప‌రిమితిని పెంచింది. ఇప్ప‌టి వ‌ర‌కు ఐఎంపీఎస్ ద్వారా గ‌రిష్టంగా రూ.2ల‌క్ష‌లు మాత్ర‌మే పంపే వీలుండ‌గా దాన్ని రూ.5ల‌క్ష‌ల‌కు పెంచుతున్న‌ట్లు ఆర్‌బీఐ గ‌వ‌ర్న‌ర్ శక్తికాంత దాస్ తెలిపారు.

రెండు రోజుల పాటు సాగిన ఆర్‌బీఐ మానిటరీ పాలసీ కమిటీ(ఎంపీసీ) సమావేశంలో తీసుకున్న కీలక నిర్ణయాలను శుక్ర‌వారం శక్తికాంత దాస్‌ మీడియాకు వెల్లడించారు. ఐఎంపీఎస్‌ లావాదేవీ ప‌రిమితిని రూ.5 ల‌క్ష‌ల‌కు పెంచుతున్న‌ట్లు తెలిపారు. వినియోగదారులకు ఉత్తమ సేవలు అందించాలన్న నేపథ్యంలో ఈ ప్రతిపాదన చేయడం జ‌రిగింద‌న్నారు. ఈ నిర్ణయం వల్ల డిజిటల్ చెల్లింపులు మరింతగా పెరుగుతాయనే ఆశాభావం వ్యక్తం చేశారు. త్వరలోనే బ్యాంకులకు అధికారిక ఉత్తర్వులు జారీ చేయడం జరుగుతుందన్నారు.

బ్యాంకుల లావాదేవీల్లో ఐఎంపీఎస్ కీలకమైన చెల్లింపు వ్య‌వ‌స్థ‌. ఒక అకౌంట్ నుంచి మరో అకౌంట్ కు క్షణాల్లో న‌గదును పంపించేందుకు దీనిని ఉపయోగిస్తుంటారు. 2010లో దీనిని ప్రారంభించారు. 24 గంట‌లు ఈ సేవ‌లు ప‌నిచేస్తాయి. 20014 జ‌న‌వ‌రిలో ఐఎంపీఎస్ లావాదేవీల గరిష్ట పరిమితి రూ. 2లక్షలుగా నిర్ణయించగా.. తాజాగా దీన్ని రూ.5ల‌క్ష‌ల‌కు పెంచ‌డం విశేషం.

ఇదిలా ఉంటే..ఎనిమిదోసారి తర్వాత కూడా వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పులు చేయలేదు. రెపోరేట్‌, రివర్స్‌ రెపోరేట్‌లను మార్చకుండా 4 శాతం, 3.35 శాతానికి, ఎస్‌ఎఫ్‌ కూడా 4.25 శాతానికే పరిమితం చేసినట్లు ఆర్‌బీఐ గ‌వ‌ర్న‌ర్ తెలిపారు.

Next Story