దేశీయంగా సెమీ కండక్టర్ చిప్పేట్లు, డిస్ప్లే తయారీ ప్రారంభమైతే ల్యాప్‌టాప్ ధరలు తగ్గే అవకాశం ఉంది. ఈ విషయాన్ని ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో వేదాంత గ్రూప్ ఛైర్మన్ అనిల్ అగర్వాల్ చెప్పారు. ఆయన మాట్లాడుతూ.. భారత్‌లో తయారు చేసిన సెమీకండక్టర్లు, డిస్ప్లే గ్లాస్ ల్యాప్‌టాప్ ధరను రూ. 1 లక్ష నుండి 40,000 వరకు తగ్గిస్తాయి అని అన్నారు. వేదాంత గ్రూప్, తైవాన్‌కు చెందిన ఫాక్స్‌కాన్ జాయింట్ వెంచర్ అహ్మదాబాద్ సమీపంలో 1,000 ఎకరాలలో 1.54 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడితో భారతదేశపు మొట్టమొదటి సెమీకండక్టర్, డిస్ప్లే గ్లాస్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయడానికి గుజరాత్ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది.
ఈ ప్లాంట్ ప్రారంభమైతే దాదాపు లక్ష మందికి ఉపాధి లభిస్తుంది. జాయింట్ వెంచర్‌లో ఫాక్స్‌కాన్ 38% వాటాను కలిగి ఉంటుందని ఆయన తెలిపారు. ప్రస్తుతం భారత్, తైవాన్, దక్షిణ కొరియా నుండి ల్యాప్‌టాప్‌లు, మొబైల్‌ల కోసం డిస్‌ప్లే గ్లాస్‌ను దిగుమతి చేసుకుంటుండగా, హాంకాంగ్, సింగపూర్, వియత్నాం, కొరియా నుండి సెమీకండక్టర్లను తెస్తున్నారని చెప్పారు. అయితే ప్లాంట్ లొకేషన్ కోసం స్వతంత్ర ఏజెన్సీ గుజరాత్‌ను ఎంపిక చేసిందని అనిల్ ఒక ప్రశ్నకు స్పష్టం చేశారు. అయితే, మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, ఎలక్ట్రిక్ వాహనాల తయారీకి మహారాష్ట్రలో వేదాంత హబ్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు.