బ్యాంకు ఖాతాదారు మరణిస్తే.. ఆ ఖాతాలోని డబ్బుని ఏం చేస్తారు? ఆ సొమ్ము ఎవరికి దక్కుతుంది? అనే సందేహం చాలా మందికి వచ్చే ఉంటుంది. అయితే ఇలాంటి సమయంలో ఖాతాదారుని పెట్టుబడులు, డిపాజిట్లపై మొత్తం హక్కు నామినీ చేతిలోకి వెళ్తుంది. మరణించిన వారి ఖాతాలోని డబ్బు కూడా నేరుగా నామినీకే బదిలీ చేస్తారు. అయితే, ఇందుకు కొన్ని పత్రాలు మాత్రమే అవసరం అవుతాయి. ఒక వేళ నామినీ అందుబాటులో లేకపోతే ఖాతాదారుని చట్టపరమైన వారసులు ఆ డబ్బును పొందేందుకు దావా వేయవలసి ఉంటుంది.
దీని కోసం వారు మరణ ధ్రువీకరణ పత్రం, చట్టపరమైన వారసుడి ఫొటో, మరణించిన వారి కేవైసీ వంటి తగిన పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. ఖాతాదారుని చట్టపరమైన వారసులైన జీవిత భాగస్వామి, పిల్లలు, తల్లిదండ్రులతో సహా ఎవరైనా డబ్బును క్లెయిమ్ చేసుకోవచ్చు. కానీ, ఇందుకు కాస్త సమయం పడుతుంది. ఇలా బ్యాంకుల్లో వారసుల వివరాలు లేక ఎవరూ క్లెయిమ్ చేయని డబ్బు వేల కోట్లలో ఉందని ఆర్బీఐ గతంలో వెల్లడించింది.