ఆర్థిక మందగమనం, ఆర్థిక మాంద్యం భయాందోళనల మధ్య అమెరికాలోని బడా కంపెనీలు మొదలు చిన్న కంపెనీలు చాలా వరకు తమ ఉద్యోగులను ఇంటికి సాగనంపుతున్నాయి. ట్విట్టర్, మెటా, అమెజాన్, సిప్కో వంటి కంపెనీలు భారీ లే ఆఫ్స్‌ను ప్రకటిస్తున్నాయి. తాజాగా కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు, ప్రింటర్లుతయారు చేసే హెచ్‌పీ కంపెనీ సైతం ఈ జాబితాలో చేరింది. 6 వేల మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు వెల్లడించింది. అయితే.. ఇప్పటికిప్పుడే అంత మందిని తొలగించమని 2025 చివరి నాటికి ఇంటికి పంపించనున్నట్లు తెలిపింది.
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా హెచ్‌పీ కంపెనీల్లో సుమారు 50 వేల మంది పని చేస్తున్నారు. వీరిలో 12 శాతం లేదంటే నాలుగు నుంచి ఆరు వేల మంది ఉద్యోగులను తగ్గించుకోవాలని కంపెనీ భావిస్తోంది. ఆర్ధిక ఫలితాల అనంతరం కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది. పీసీ సేల్స్ పడిపోవడం అందుకు ఓకారణంగా చెబుతోంది. 2022లో ఎదురైన సవాళ్లే 2023 ఆర్థిక సంవత్సరంలోనూ కొనసాగనున్నాయని కంపెనీ అంటోంది. వచ్చే ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో అంచనాలకంటే తక్కువ లాభాలు నమోదు అయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తోంది. ఉద్యోగాలు కోల్పోయే వారికి తాము వెన్నంటి ఉంటామని, వారు మరో అవకాశం పొందేలా ఆర్ధికంగా, కెరీర్ సేవల పరంగా సాయం చేస్తామని హెచ్‌పీ తెలిపింది.