దేశంలోని అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ తన మోటార్‌సైకిళ్లు, స్కూటర్ల ధరలను రూ.1500 వరకు పెంచనున్నట్లు తెలిపింది. డిసెంబర్ 1 నుంచి పెంచిన ధరలు అమల్లోకి వస్తాయని ఓ ప్రకటనలో పేర్కొంది. మోడల్, విక్రయించే ప్రాంతాన్ని బట్టి ధర పెరుగుదల్లో తేడాలు ఉంటాయని వివరించింది.
"ద్రవ్యోల్బణ పరమైన వ్యయాల కారణంగా మా మోటార్‌సైకిళ్లు, స్కూటర్ల ధరలను పెంచక తప్పడం లేదు. వినియోగదారులపై ఆ ప్రభావం ఎక్కుగా పడకుండా ఉండడేందుకు మేము వినూత్న ఫైనాన్సింగ్ ఆప్షన్లు కూడా అందిస్తాం" అని హీరో మోటోకార్ప్ ముఖ్య ఆర్థిక అధికారి నిరంజన్ గుప్తా తెలిపారు.
"మేము వేగవంతమైన పొదుపు ప్రోగ్రామ్‌లను కూడా పాటిస్తున్నాం. అయితే.. ఇది తదుపరి వ్యయ ప్రభావాన్ని తగ్గించడానికి, మార్జిన్‌లను మెరుగుపరచడంతో మాకు సహపడుతుంది. మార్కెట్‌లో డిమాండ్ పెరిగే సంకేతాలు కనిపిస్తున్న నేపథ్యంలో రాబోయే త్రైమాసికాల్లో పరిశ్రమ అమ్మకాలు పుంజుకుంటాయని ఆశిస్తున్నట్లు గుప్తా చెప్పారు.
హీరో మోటోకార్ప్ కంపెనీ.. స్ల్పెండర్ ఫ్లస్, HF డీలక్స్, HF 100, ప్యాషన్ ప్రో, సూపర్ స్ల్పెండర్ , గ్లామర్, Xtreme 160R, Xtreme 200S, Xpulse 200 4V, Xpulse 200T వంటి మోటార్‌సైకిళ్లను విక్రయిస్తోంది. Pleasure+ XTEC, Maestro Edge 110, Maestro Edge 125, Destini 125 XTEC వంటి స్కూటర్‌లను అందిస్తుంది.