ఇతరులు తీసుకునే బ్యాంక్‌ లోన్‌కు మీరు ష్యూరిటీ ఇస్తున్నారా?.. అయితే ఇది మీ కోసమే

స్నేహితులు, బంధువులు, పరిచయస్థులు వ్యక్తిగత అవసరాల కోసం రుణాలు తీసుకునే ముందు ష్యూరిటీ కోసం వస్తే మనలో చాలా మంది ఆలోచించకుండా సంతకాలు చేసేస్తుంటారు.

By అంజి  Published on  8 Feb 2024 5:30 AM GMT
bank loan, Surety, Business, Credit score

ఇతరులు తీసుకునే బ్యాంక్‌ లోన్‌కు మీరు ష్యూరిటీ ఇస్తున్నారా?.. అయితే ఇది మీ కోసమే

స్నేహితులు, బంధువులు, పరిచయస్థులు వ్యక్తిగత అవసరాల కోసం రుణాలు తీసుకునే ముందు ష్యూరిటీ కోసం వస్తే మనలో చాలా మంది ఆలోచించకుండా సంతకాలు చేసేస్తుంటారు. చివరికి వారు ఆ లోన్‌ చెల్లించకపోతే సమస్యల్లో చిక్కుకోవాల్సి వస్తుంది. దానికి ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి. అవేంటో ఇప్పుడు చూద్దాం..

- సాధారణంగా బ్యాంకులు వేరే వ్యక్తులను ష్యూరిటీ అడిగాయి అంటే.. రుణం కోరే వ్యక్తి ఆర్థిక చరిత్ర సరిగా లేదని అర్థం. క్రెడిట్‌ స్కోర్‌ సరిపడినంత లేకపోయినా, ఆ వ్యక్తి చేసే ఉద్యోగం రిస్క్‌తో కూడుకున్నదైనా బ్యాంకులు ఇలా ష్యూరిటీ అడుగుతాయి. ష్యూరిటీ ఇచ్చే ముందు ఈ అంశాలను అన్నింటీని పరిగణలోకి తీసుకుని లోన్‌ తీసుకుంటున్నవారు వారి రుణానికి రక్షణగా ఇన్సూరెన్స్‌ తీసుకోవాలని సూచించాలి. ఒకవేళ ఏదైనా అనుకోని పరిస్థితిలో రుణం చెల్లించలేకపోయినా.. భద్రత ఉంటుంది.

- ఒక వేళ ఆ వ్యక్తి లోన్‌ సకాలంలో చెల్లించకపోతే, ఆ భారం మీపై పడుతుంది. తద్వారా మీ క్రెడిట్‌ స్కోర్‌పై ప్రభావం పడే అవకాశం ఉంటుంది. కాబట్టి వారు వాయిదాలు చెల్లిస్తున్నారో లేదో చెక్‌ చేసుకోవడం మంచిది.

- ఒక లోన్‌కి హామీ ఇస్తున్నారు అంటే.. ఆ మొత్తం చెల్లించడానికి నేను సిద్ధమే అని అంగీకరించినట్టు అర్థం. భవిష్యత్తులో మీరు ఏవైనా రుణాలు తీసుకోవాలి అనుకుంటే, బ్యాంకులు ఈ హామీ మొత్తాన్ని కూడా పరిగణలోకి తీసుకుంటాయి. దాని ఆధారంగా లోన్‌ ఇవ్వాలో లేదో నిర్ణయించుకుంటాయి. కాబట్టి మీకు లోన్‌ అవసరం ఉంది అనుకున్నప్పుడు.. వేరే వారికి హామీ ఇవ్వకపోవడం ఉత్తమం.

- ఒకసారి ఇతరుల రుణానికి హామీ ఇస్తున్నారు అంటే.. ఆ రుణం పూర్తిగా చెల్లించేవరకు ఆ భారం మీపై ఉంటుంది. అత్యవసర పరిస్థితుల్లో తప్పుకోవాలి అనుకుంటే మీ స్థానంలో వేరే వ్యక్తులు హామీ ఇవ్వాల్సి ఉంటుంది.

- వేరొకరి రుణానికి మీరు హామీ ఇవ్వాల్సి వచ్చినప్పుడు రుణానికి సంబంధించిన నియమ నిబంధనల గురించి బ్యాంకు ప్రతినిధులతో నేరుగా చర్చించాలి. రుణ గ్రహీతకు పంపించే సమాచారం అంతా మీకు కూడా పంపాలని బ్యాంకులను కోరవచ్చు. ఒక వేళ చెల్లింపు ఆలస్యం అయితే గ్రేస్‌ పిరియడ్‌ ఎంత, తదితర విషయాలపై అవగాహన అవసరం.

Next Story