HDFC బ్యాంక్ ఛైర్మన్ సంచలన రాజీనామా..'నైతిక విలువలు ముఖ్యం'అంటూ వైదొలగిన చక్రవర్తి

దేశంలోని ప్రముఖ ప్రైవేట్ రంగ బ్యాంకు హెచ్‌డీఎఫ్‌సీ (HDFC)లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది.

By -  Knakam Karthik
Published on : 19 March 2026 12:53 PM IST

Business News, HDFC Bank, Atanu Chakraborty, Stock Market Crash, HDFC Shares

HDFC బ్యాంక్ ఛైర్మన్ సంచలన రాజీనామా..'నైతిక విలువలు ముఖ్యం'అంటూ వైదొలగిన చక్రవర్తి

దేశంలోని ప్రముఖ ప్రైవేట్ రంగ బ్యాంకు హెచ్‌డీఎఫ్‌సీ (HDFC)లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. బ్యాంకు పార్ట్‌టైమ్ ఛైర్మన్ అటాను చక్రవర్తి తన పదవికి ఆకస్మికంగా రాజీనామా చేశారు. నైతిక విలువలు మరియు బ్యాంకింగ్ పద్ధతులపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ ఆయన తప్పుకోవడం ఇప్పుడు కార్పొరేట్ రంగంలో చర్చనీయాంశంగా మారింది. ఒక ప్రధాన బ్యాంకు ఛైర్మన్ పదవీ కాలం మధ్యలోనే నైతిక కారణాలను చూపుతూ వైదొలగడం ఇదే మొదటిసారి.

మార్చి 17న సమర్పించిన తన రాజీనామా లేఖలో చక్రవర్తి సంచలన వ్యాఖ్యలు చేశారు. "గత రెండేళ్లుగా బ్యాంకులో నేను గమనించిన కొన్ని సంఘటనలు, అనుసరిస్తున్న పద్ధతులు నా వ్యక్తిగత విలువలకు, నైతికతకు విరుద్ధంగా ఉన్నాయి. అందుకే ఈ నిర్ణయం తీసుకుంటున్నాను" అని ఆయన స్పష్టం చేశారు. ఈ రాజీనామాను ధ్రువీకరించిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, చక్రవర్తి స్థానంలో కేకీ మిస్త్రీని తాత్కాలిక ఛైర్మన్‌గా నియమించినట్లు వెల్లడించింది. దీనికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కూడా ఆమోదం తెలిపింది.

ఛైర్మన్ రాజీనామా వార్త మార్కెట్లను కుదిపేసింది. గురువారం ఉదయం ట్రేడింగ్‌లో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ షేర్లు భారీగా పతనమయ్యాయి. బిఎస్‌ఈ (BSE)లో షేర్ విలువ 8.41 శాతం క్షీణించి రూ. 772 వద్దకు చేరుకోగా, ఇది 52 వారాల కనిష్ట స్థాయిగా నమోదైంది. కేవలం ఒక్క రోజులోనే బ్యాంకు మార్కెట్ విలువ సుమారు రూ. 65,176 కోట్లు ఆవిరైపోయింది. గవర్నెన్స్ కమిటీకి రాసిన లేఖలో, ఈ నైతిక కారణాలు తప్ప తన రాజీనామాకు ఇతర వ్యక్తిగత కారణాలేవీ లేవని చక్రవర్తి స్పష్టం చేశారు.

Next Story