పొరపాటున ఆన్‌లైన్‌లో వేరేవారికి డబ్బులు పంపించారా..? అయితే ఇలా చేయండి
ఆన్‌లైన్ పేమెంట్ విధానం అందుబాటులోకి వచ్చాక ప్రతి ఒక్కరూ ఇతరులకు డబ్బు పంపేందుకు అటువైపే మొగ్గు చూపుతున్నారు.
By అంజి Published on 27 Dec 2023 8:43 AM ISTపొరపాటున ఆన్‌లైన్‌లో వేరేవారికి డబ్బులు పంపించారా..?
ఆన్‌లైన్ పేమెంట్ విధానం అందుబాటులోకి వచ్చాక ప్రతి ఒక్కరూ ఇతరులకు డబ్బు పంపేందుకు అటువైపే మొగ్గు చూపుతున్నారు. పేటీయం, ఫోన్‌పే, గూగుల్‌పే వంటి డిజిటల్ పేమెంట్స్ యాప్‌ల ద్వారా చెల్లింపులు ఎక్కువయ్యాయి. ఇదంతా బాగానే ఉన్నా.. కొన్ని సందర్భాల్లో డబ్బును పొరపాటున ఒకరికి కాకుండా ఇంకొకరికి పంపితే అసలు సమస్య మొదలవుతుంది. అలాంటి పరిస్థితుల్లో ఆ నగదును ఎలా వెనక్కి తీసుకోవాలో సరైన అవగాహన ఉండదు. ఈ సమస్య పరిష్కారం ఏమిటో చూద్దాం..
ఇలా చేయండి
ఒకరికి బదులు వేరొకరికి నగదు బదిలీ అయితే ఫోన్‌పే, గూగుల్‌పే, పేటీఎం వంటి డిజిటల్ చెల్లింపు సంస్థలు బాధ్యత వహించవు. అయినప్పటికీ ముందుగా వారికి ఫిర్యాదు చేయాలి. మీరు పొర పాటున డబ్బు పంపిన వ్యక్తి అకౌంట్ కూడా మీ బ్యాంక్‌లోనే ఉంటే ఐదు నుంచి ఆరు రోజుల్లోగా డబ్బులు రీఫండ్ అవుతాయి. అలా కాకుండా వేరే బ్యాంక్‌లో అకౌంట్ ఉంటే నగదు వెనక్కి రావడానికి 8 రోజుల సమయం పడుతుంది.
ఇతరులకు డబ్బు పంపిన విషయాన్ని ముందుగా యూపీఐ లింక్ చేయబడిన బ్యాంక్ కస్టమర్ కేర్‌కు కాల్ చేసి సమస్యను వివరించాలి. లేదా బ్యాంక్ బ్రాంచ్‌కు వెళ్లి రాతపూర్వకంగా ఫిర్యాదు చేయాలి. అనంతరం బ్యాంక్ మీ నగదు క్రెడిట్ అయిన బ్యాంకు ఖాతాదారుడిని సంప్రదిస్తుంది. మీ ఖాతాకు నగదును పంపించేందుకు అతని అనుమతి తీసుకుంటుంది. అతను అంగీకరిస్తే.. మీ నగదు మీకు జమ అవుతుంది.
అయితే కొన్ని సందర్భాల్లో అతను ఆ డబ్బును పంపేందుకు అంగీకరించకపోతే అప్పుడు మీరు చట్టపరంగా ముందుకు వెళ్లొచ్చు. అందుకు మీ బ్యాంక్ మీకు సహాయం అందిస్తుంది. మీ పేరు, చిరునామా, బ్యాంక్ బ్రాంచ్, మొబైల్ నంబర్, ఈ మెయిల్ ఐడీ, అడ్రస్ ప్రూఫ్‌లు, ట్రాన్సాక్షన్ చేసిన తేదీ, సమయం, ట్రాన్సాక్షన్ మొత్తం వంటి వివరాలను సమర్పించి కోర్టుకు వెళ్లవచ్చు.
దీంతో కోర్టు కేసును విచారించి డబ్బును పొరపాటుగా పంపినట్లు నిర్ధారణకు వస్తే అప్పుడు అవతలి వ్యక్తులకు డబ్బును వెనక్కి ఇవ్వాలని చెబుతుంది. దీంతో మీ డబ్బులు వెనక్కి వస్తాయి. అయితే ఈ సందర్భాల్లో మీ డబ్బులు మీకు వెనక్కి వచ్చేందుకు కనీసం రెండు నెలల సమయం పడుతుంది. కొన్ని సందర్భాల్లో అంతకన్నా ఎక్కువ సమయమే పట్టవచ్చు.
ఆర్‌బీఐ నిబంధనల ప్రకారం.. తప్పుడు ఖాతాకు నగదు బదిలీ వంటి ఫిర్యాదులను 7 నుంచి 15 రోజుల్లోపు పరిష్కారం చూపాల్సి ఉంటుంది. ఇంకా కొన్ని సమయాల్లో తప్పుడు ఖాతాకు నగదు బదిలీ చేసిన ఫిర్యాదుపై వీరెవరు సరిగా స్పందించకుంటే ఆర్‌బీఐ ఏర్పాటు చేసిన ఫిర్యాదుల విభాగం అంబుడ్స్‌మన్‌కు ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది.
అన్ని సందర్భాల్లో నగదు వెనక్కి వచ్చే అవకాశం ఉండదు. అందువల్ల నగదును వేరే యూపీఐ, బ్యాంకు ఖాతాలకు బదిలీ చేయాల్సి వచ్చినప్పుడు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి. అలాగే యూపీఐ పిన్‌ను ఎవరితోనూ పంచుకోవద్దు. యూపీఐ చెల్లింపులు చేసేందుకు పిన్ కచ్చితంగా అవసరం అవుతుంది. కనుక, అత్యంత సీక్రెట్‌గా ఈ పిన్‌ను దాచి పెట్టాల్సి ఉంటుంది. ఏటీఎం పిన్‌ను ఎంత భద్రంగా ఉంచుతారో.. యూపీఐ పిన్‌ను జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది.