పెట్రోల్, డీజిల్ ధరలపై రూ.8 తగ్గింపు?
పెట్రోల్, డీజిల్ ధరలను భారీగా తగ్గించాలని ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది.
By అంజి Published on 29 Dec 2023 6:47 AM ISTపెట్రోల్, డీజిల్ ధరలపై రూ.8 తగ్గింపు?
పెట్రోల్, డీజిల్ ధరలను భారీగా తగ్గించాలని ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి పెట్రోలియం సంస్థలతో ప్రభుత్వం చర్చలు జరుపుతోందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. పెట్రోల్, డీజిల్ ధరలు లీటరుపై కనీసం రూ.8 నుంచి రూ.10 వరకు తగ్గే అవకాశం ఉందని అంచనా. ఈ నెలాఖరులోపే ఇది అమలులోకి రావొచ్చని పేర్కొంటున్నాయి. వచ్చే ఏడాది 2024 ప్రథమార్థంలో సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా కేంద్రం ఈ చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం.
సామాన్యులకు ఉపశమనం కలిగించడానికి చమురు మార్కెటింగ్ కంపెనీలతో చర్చలు జరుగుతున్నాయి. ధరల తగ్గింపు యొక్క భారాన్ని ప్రభుత్వం, ఓఎమ్‌సీలు సమానంగా భరించాలనే ప్రతిపాదన పరిశీలనలో ఉంది. కేంద్రం లీటరుకు రూ.10 వరకు అధిక ధరను తగ్గించే అవకాశం ఉంది. ఇంధన ధరల తగ్గింపు నవంబర్‌లో మూడు నెలల గరిష్ట స్థాయి 5.55%కి పెరిగిన రిటైల్ ద్రవ్యోల్బణాన్ని కూడా తగ్గిస్తుంది. ఇదే విషయమై పెట్రోలియం మంత్రిత్వ శాఖ, ఆర్థిక మంత్రిత్వ శాఖ ఇటీవల చర్చలు జరిపాయి. దీనికి సంబంధించి ప్రధాన మంత్రి కార్యాలయానికి రిపోర్ట్‌ను సమర్పించాయి.
ఇంధన ధరలపై ఈ రెండు మంత్రిత్వ శాఖలు ప్రతి పదిహేను రోజులకు ఒకసారి చర్చలు జరుపుతాయి. ముడి చమురు ధరలు గత మూడు నెలలుగా బ్యారెల్‌కు 70-80 డాలర్ల శ్రేణిలో ఉన్నందున ఇంధన ధరల తగ్గింపుకు కేంద్ర ప్రభుత్వం అనుకూలంగా ఉందని వర్గాలు తెలిపాయి. నవంబర్ 2021, మే 2022లో రెండు విడతలుగా కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ ఎక్సైజ్ సుంకాన్ని లీటరుకు పెట్రోల్‌పై లీటరుకు రూ. 13, డీజిల్‌పై లీటరుకు రూ. 16 చొప్పున తగ్గించింది. ఎక్సైజ్ తగ్గింపులు పూర్తిగా వినియోగదారులకు అందించబడ్డాయి. ఫలితంగా రిటైల్ ధరలు తగ్గాయి.