ఆసియా లోని కుబేరుల్లో భారతీయలు సరికొత్త రికార్డులను సృష్టిస్తూ ఉన్నారు. ముఖ్యంగా రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ, అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ తమ సంపదనను పెంచుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారు. ముకేశ్ అంబానీ ఆసియాలో అత్యంత ధనికుడిగా ఉండగా.. గౌతమ్ అదానీ రెండో స్థానంలోకి వచ్చేశారు. గత కొద్దిరోజులుగా అదానీ గ్రూప్ కు చెందిన షేర్లు పెరుగుతూ వెళ్లడంతో గౌతమ్ అదానీ రెండో స్థానానికి చేరుకున్నారు. చైనాకు చెందిన జాంగ్ షాన్‌షన్‌ను వెనక్కి నెట్టి గౌతమ్ అదానీ ఆసియాలోనే ధనవంతుల్లో రెండో స్థానానికి చేరుకున్నారు. బ్లూమ్‌బర్గ్ బిలియనీర్ సూచీ ప్రకారం.. అదానీ నికర సంపద 66.5 బిలియన్ డాలర్లకు చేరగా.. జాంగ్ సంపద 63.6 బిలియన్ డాలర్లుగా ఉంది. ఈ ఏడాది అదానీ సంపద విలువ ఏకంగా 32.7 బిలియన్ డాలర్లు పెరిగింది.
ఈ ఏడాది ఫిబ్రవరిలో జాంగ్‌ను వెనక్కి నెట్టి ఆసియా కుబేరుడిగా రిలయన్స్ ఇండస్ట్రీస్ అధిపతి ముకేశ్ అంబానీ అవతరించారు. అంబానీ సంపద 175.5 మిలియన్ డాలర్లు తగ్గి 76.5 బిలియన్ డాలర్లకు చేరింది. ప్రస్తుతం ప్రపంచ కుబేరుల జాబితాలో ముకేశ్ 13వ స్థానంలో, గౌతమ్ అదానీ 14వ స్థానంలో ఉన్నారు.
గురువారం నాటికి అదానీ నికర సంపద 66.5 మిలియన్ డాలర్లకు చేరుకుందట. ఒక్క సంవత్సరంలోనే అదానీ సంపద 32.7 బిలియన్ డాలర్లు పెరగడంతో భారత్ లోనే రెండో ధనికుడిగా మాత్రమే కాకుండా.. ఆసియాలోనే రెండో ధనికుడిగా నిలిచాడు. మే 2020 నుండి అదానీ సంపద పెరుగుతూ వెళ్ళింది. అదానీకి చెందిన ఆరు కంపెనీలు స్టాక్ మార్కెట్ లో అద్భుతమైన రైజింగ్ ను చూశాయి. అదానీ సంపద గత ఏడాది మే నెల నుండి ఇప్పటి వరకూ 6 రెట్లు పెరిగింది.